బాహుబలి చిత్రం ద్వారా అంతర్జాతీయంగా భారతీయ సినిమాకి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇటీవలే పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన "అంతర్జాతీయ చలనచిత్రోత్సవం"లో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి రాజమౌళి వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.
భారతదేశంలో చిత్రాలు తీసేటప్పుడు వివిధ వయస్కుల వారిని, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుంటామని ఆయన అన్నారు. ముఖ్యంగా చిత్రకథలో సత్తా ఉంటే.. అది కమర్షియల్ చిత్రమైనా..ఆర్ట్ ఫిల్మ్ అయినా సరే భారత్లో ప్రేక్షకులు ఆదరిస్తారని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా తాను తీయబోయే కథపై దర్శకుడికి పూర్తి అవగాహన ఉండాలని.. దానిని బలంగా తెరపై చూపించాలనే ఆకాంక్ష కూడా ఉండాలని.. అప్పుడే చిత్రం విజయవంతమవుతుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు
రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం పాకిస్తాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ఇప్పటికే చైనాతో పాటు జపాన్, కొరియా, తైవాన్, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్, కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ దేశాలలో బాహుబలి చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. పాకిస్తాన్లో బాహుబలి చిత్రం మే 2017న విడుదల అయ్యింది.
చిత్రమేంటంటే.. పాకిస్తాన్ సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ చెప్పకుండానే.. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. అలాగే డబ్బింగ్ చేసి పాకిస్తాన్ ప్రాంతంలో విడుదల చేసిన తొలి ప్రాంతీయ భాష చిత్రం కూడా బాహుబలి కావడం విశేషం