KTR Comments On Development In AP: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు.. రోడ్డు బాగాలేవన్న వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారం రేపాయి. క్రెడాయ్ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. పై విధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రోడ్లు సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినదంటూ.... మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మంటలు రేపుతున్నాయి. కేటీఆర్‌పై ఏపీ మంత్రి బొత్స, సహా పలువురు వైసీపీ నేతలు తీవ్ర వ్రస్థాయిలో మండిపడ్డారు. మీ రాష్ట్రాభివృద్దికి మీరు చేసే ప్రయత్నాలను తాము కాదనలేమని.. అయితే పక్క రాష్ట్రాల అభివృద్ధిని కించపరిచే విధానం బాగాలేదంటూ చురకలంటించారు.
ఈ వివాదంపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. 'మంత్రి కేటీఆర్ తన నోటిదురుసుతనం తగ్గించుకుంటే బాగుంటుంది' అని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రానికి జగన్ సీఎం అయితే బాగుంటుందనే వాళ్లు ఎంతోమంది ఉన్నారన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వేలాది మంది తరలివచ్చిన సంగతి మరిచిపోవదన్నారు. ఇక స్వరాష్ట్రంలోని విపక్షాలు సైతం కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కూట్లో రాయెత్తలేనోడు ఏటిలో రాయి ఎత్తుతానని బీరాలు పలికినట్టు... ముందు సొంతిళ్లు చక్కదిద్దుకో అంటూ చురకలంటిస్తున్నారు.
సీన్ కట్ చేస్తే... డామిట్ కథ అడ్డం తిరిగిందనుకున్నారు మంత్రి కేటీఆర్. తన మాటలు ఏపీ అధికార పార్టీ నేతలను బాధించినందుకు బాధపడుతున్నానని.. అయితే తమ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నదే తమ అభిమతమంటూ... సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేసారు. అయితే కథ ఇంతటితో ఆగిపోలేదు. సాధించి తెచ్చుకున్న తెలంగాణను కల్వకుంట్ల ఫ్యామిలీ కొల్లగొడుతోందంటూ తెలంగాణ బీజేపీ నేతలు ఒంటికాలుపై లేస్తున్నారు. మాజీమంత్రి డీకే అరుణ ఏకంగా తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలోని రోడ్లు దుస్థితి, కరెంట్ కోతలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అద్వాన్నంగా ఉన్న రోడ్లను చూపిస్తానంటూ తనవెంట రాగల ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
మరోవైపు కేటీఆర్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో రగడ ఆగడం లేదు. తెలంగాణ ప్రజలు తమ స్వరాష్ట్ర ఆకాంక్షను పోరాడి సాధించుకుంటే కేసీఆర్ కుటుంబం కొళ్లగొడుతోందని సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించాలని... ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగత నిర్మూలించలేక పోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి రాష్ట్ర అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మేడిపండు చందంగా పైన బంగారు తెలంగాణ అంటూ... లోన మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారంటు చురకలంటిస్తున్నారు.
ఇదిలావుంటే ఇంకోవైపు తెలంగాణలో ఈమధ్యే కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సైతం మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల తారకరామా రావు దోస్తులంతా ఆంధ్రావాళ్లే అని ట్వీట్ చేశారు. వారిలో మెగా క్రిష్ణా రెడ్డి, ఫినిక్స్ సురేష్ వంటి ధనవంతులే ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలోని పేద రైతులు, నిరుద్యోగులు అంటే ఆయనకు అసలే గిట్టదని ఎద్దేవా చేశారు. మొత్తానికి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ (Minister KTR) చేసిన వ్యాఖ్యలు మంటలు ఇప్పట్లో చల్లారేలా లేనట్లు కనిపిస్తున్నాయి.
Also read : CM Jagan Tour: కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయాతో సీఎం జగన్ భేటీ..!
Also read : Prashanth Kishore: బీజేపీని ఓడించే చిట్కా చెప్పిన ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ ఏమంటారో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook