అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు రెండో టెట్ ప్రతిపాదనను విద్యాశాఖ ఉంచింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం, ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించుకోవచ్చని, మరో టెట్ నిర్వహించుకొనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుపెట్టామని విద్యాశాఖ కమిషనర్ సంద్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ నిర్వహణ, డీఎస్సీ తదితర అంశాల్లో అభ్యర్థులు ఎలాంటి గందరగోళం చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో కొందరు అభ్యర్థులకు ఐదు ప్రశ్నలు ఆన్లైన్లో కనిపించకపోవడం సాంకేతిక లోపం వల్ల వచ్చిన సమస్య అని, రేపొద్దున ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక, విషయ పరిజ్ఞానం గల నిపుణులతో ఓ కమిటీ వేశామని అన్నారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థులకు తప్పుడు ఆన్సర్ షీట్ల(రెస్పాన్స్ షీట్లను)ను ఇస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు.