పెట్రోల్‌ను జీఎస్టీలో చేరిస్తేనే ఊరట: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి.

Last Updated : Apr 21, 2018, 06:37 AM IST
పెట్రోల్‌ను జీఎస్టీలో చేరిస్తేనే ఊరట: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

పెట్రో ఉత్పత్తులను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తేనే సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయని బీహార్‌లోని బెహరీలో అన్నారు. శుక్రవారం రెండో విడత ఉజ్వల యోజనను ప్రరంభించడానికి వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

సిరియా అంతర్యుద్ధం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తున్న క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయని అన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడాదైనా కాకముందే తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని రాష్ట్రాలు ఆందోళన పడుతున్నాయని అన్నారు.

ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. కడపటి వార్తలు అందేసరికి, ఈ ధరలు గరిష్ఠానికి చేరాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.65.46గా, పెట్రోల్ ధర రూ.74.21గా నమోదవ్వగా.. కోల్‌కతాలో డీజిల్‌ రూ.68.16, పెట్రోల్ రూ.76.78గా నమోదైంది. చెన్నైలో డీజిల్‌ ధర రూ.69.06, పెట్రోల్ రూ.76.85 గా, హైదరాబాద్ లో పెట్రోల్ రూ.78.59గా, డీజిల్ రూ.71.12గా నమోదయ్యాయి.

Trending News