Munugode By Election: ఎన్నికల షెడ్యూల్ రాకముందే మునుగోడు ఉప ఎన్నిక సమరం పీక్ స్టేజీకి చేరింది. తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహంచారు. శనివారం సీఎం కేసీఆర్ ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం బీజేపీ సమరభేరీ సభ జరిపింది. ఈ సభలోనే అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బహిరంగ సభలను సవాల్ గా తీసుకుని రెండు పార్టీలు భారీగా జన సమీకరణ చేశాయి. అయితే రెండు సభలకు వచ్చిన జనాలకు, స్పందనలను బట్టి ఉప ఎన్నికపై నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
అమిత్ షా సభతో మునుగోడులో బీజేపీలో జోష్ కనిపిస్తోందని తెలుస్తోంది. ఊహించిన దానికంటే అమిత్ షా సభ కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారని స్థానిక నేతలు చెబుతున్నారు.ముందు రోజు జరిగిన కేసీఆర్ సభ కంటే బీజేపీ సమరభేరీ సభకు జనాలు ఎక్కువగా వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జన సమీకరణ కోసం వారం రోజుల ముందే మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించారు. మంత్రితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలంతా వారం రోజులు ప్రతి ఊరు తిరిగారు. నిధులను కూడా హైకమాండ్ సమకూర్చింది. అయినా కేసీఆర్ సభకు ఆశించినంతగా జనం రాలేదంటున్నారు. గ్రామ స్థాయి నాయకులు సీరియస్ గా పని చేయకపోవడమే ఇందుకు కారణమనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కేసీఆర్ సభకు ధీటుగా అమిత్ షా సభకు జనసమీకరణ చేశారని అంటున్నారు. ముందురోజు కేసీఆర్ సభకు వెళ్లిన వాహనాలు, జనాలనే రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సభకు తరలించి గులాబీ పార్టీకి షాకిచ్చారని అంటున్నారు.
ఇక మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఖాయమే. నియోజకవర్గంలో ఆయన పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఉన్న మెజార్టీ కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీలు కమలం గూటికి చేరారు. టీఆర్ఎస్ నేతలను బీజేపీలో చేర్చుకునేలా రాజగోపాల్ రెడ్డి ఆపరేషన్ చేపట్టనున్నారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి జనంలోకి వెళుతుండగా.. అధికార పార్టీలో మాత్రం గందరగోళం నెలకొంది.మునుగోడు సభలో అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించకపోవడంతో.. ఎవరూ పోటీలో ఉంటారన్నది సస్పెన్స్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారైందని.. మునుగోడు సభలో కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరిగినా.. ఎలాంటి ప్రకటన చేయలేదు గులాబీబాస్. దీంతో అభ్యర్థి విషయంల అధికార పార్టీలో గందరగోళం నెలకొనగా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఉత్సాహంగా జనంలోకి వెళుతున్నారు.
కేసీఆర్, అమిత్ షా సభలకు సంబంధించి ప్రభుత్వం ఇంటలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకుంటుందని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో సీరియస్ గా పని చేయకపోతే మొదటికే మోసం వస్తుందని.. హుజురాబాద్ కన్నా ఘోరంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందనే ఆందోళనలో గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో అసమ్మతి తీవ్రంగా ఉందని.. అది సెట్ కాకపోతే పార్టీకి తీరని నష్టం జరగడం ఖాయమని పీకే టీమ్ కూడా కేసీఆర్ కు నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నికలో త్వరలోనే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో పాటు మునుగోడు నియోజకవర్గంలోని పార్టీ ప్రతినిధులు, టికెట్ ఆశిస్తున్న నేతలను ఈ సమావేశానికి పిలవనున్నారని చెబుతున్నారు. మునుగోడు అభ్యర్థి విషయంలోనూ కేసీఆర్ నిర్ణయం మారిపోయిందని తెలుస్తోంది. బలమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టడం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కూసుకుంట్ల టికెట్ ఇస్తే స్థానిక కేడర్ సహకరించే పరిస్థితి కూడా లేదని కేసీఆర్ కు రిపోర్టులు వెళ్లాయంటున్నారు. దీంతో నాగార్జున సాగర్ తరహాలోనే బీసీ నేతను బరిలోకి దింపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. నియోజరవర్గంలో బీసీ వాదం బలంగా ఉందని పీకే టీమ్ సర్వేలోనూ తేలిందని తెలుస్తోంది.
Also read: Pawan Fans Unhappy with Amit Shah: ఎన్టీఆర్ కు ఆహ్వానమా? అసంతృప్తితో పవన్ ఫాన్స్!
Also read: Amit Shah Munugode: కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం..కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి