పశు దాణా కుంభకోణంలో కేసులో జైలుపాలైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణాల రీత్యా ఆరు వారాల బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. అయితే, జైలు నుంచి విడుదలై బయటికొచ్చిన లాలూని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లిన యోగా గురు రాందేవ్ బాబా.. ఆరోగ్యం కుదుటపడటం కోసం నిత్యం యోగా చేయాల్సిందిగా లాలూకు సూచించారట. అవును, ఈ విషయాన్ని స్వయంగా రాందేవ్ బాబానే మీడియాతో పంచుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ని కలిసిన అనంతరం రాందేవ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ఆరు వారాలపాటు బెయిల్ పొందినందుకు అభినందనలు తెలిపానని, అనంతరం లాలూ ఆరోగ్యంగా వుండేందుకు పలు యోగాసనాలు చెప్పానని అన్నారు.
రాందేవ్ చెప్పినట్టుగా లాలూ ప్రసాద్ యాదవ్ నిత్యం యోగా చేస్తారో తెలియదు కానీ లాలూ ప్రసాద్ ఏం చేస్తున్నారనేదానిపై మాత్రం పోలీసుల నుంచి కఠినమైన పర్యవేక్షణ వుండనుంది. బెయిల్ పై వున్నంత కాలం లాలూ మీడియాతో మాట్లాడకూడదు అనేది అతడిపై వున్న ఆంక్షల్లో ఒకటి. అందులో భాగంగానే లాలూ ఎప్పుడు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేదంతా పోలీసుల నిఘా కెమెరాల్లో రికార్డ్ అవుతూనే వుంటుంది. అంతేకాకుండా బీహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన భద్రతా దళాలు లాలూని నిరంతరం అంటిపెట్టుకునే వుండనున్నాయి. డీఎస్పీ స్థాయి ర్యాంకులో వున్న నలుగురు పోలీసు అధికారులు ఈ భద్రతా ఏర్పాట్లని స్వయంగా పర్యవేక్షించనున్నారు.