కుక్కలపై యుద్ధం: చిన్నారి మృతితో యూపీ అలర్ట్

చిన్న పిల్లలను ఇంటి బయట తిరగనీయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : May 14, 2018, 06:06 PM IST
కుక్కలపై యుద్ధం: చిన్నారి మృతితో యూపీ అలర్ట్

యూపీలోని సీతాపూర్ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైంది. ఇప్పటికే 12 మంది చిన్నారులు కుక్కల దాడిలో చనిపోగా.. ఆదివారం10 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఖైరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేష్‌పూర్- చిల్లావర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాధ్ సీతాపూర్ జిల్లాలో పర్యటించి, దాడి చేస్తున్న కుక్కలను చంపివేయాలని అధికారులను ఆదేశించారు. అయినా కుక్కుల దాడులు జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం ముగ్గురు స్నేహితులతో కలిసి రీనా చిరుతిళ్లు కొనడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. రోడ్డుపై ఉన్న కుక్కలు వారిపై దాడి చేశాయి. ముగ్గురు పిల్లలు తప్పించుకోగా.. రీనా మాత్రం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయింది. జిల్లాయంత్రాంగం కుక్కల విషయంలో పూర్తిగా విఫలమైందని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు రోడ్డుపై ఆందోళనలకు దిగారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వినయ్ కుమార్ పాథక్ మాట్లాడుతూ చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామని, పోలీస్ టీమ్‌లను గ్రామంలో కూంబింగ్ ఆపరేషన్స్ కోసం రంగంలోకి దింపినట్లు చెప్పారు. చిన్నారి మృతితో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం చిన్న పిల్లలను బయట తిరగనీయవద్దంటూ ఆదేశించారు.

 

Trending News