Mission 2024: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న విపక్షాల్లో ఊపు కనిపిస్తోంది. ఎన్డీఏ నుంచి జేడీయూ బయటికి రావడంతో విపక్షాలకు బలం వచ్చినట్లైంది. బీహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. అప్పటి నుంచే 2024 సార్వత్రి ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు వినిపిస్తోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి కేంద్రంగానే ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిశారు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సోనియాను కలిశారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ వెళ్లారు. సోనియాతో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశం దేశ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
సోనియా గాంధీ డైరెక్షన్ లో విపక్షాల మిషన్ 2024 మొదలైందని తెలుస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలను ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సోనియా గాంధీ. బీహార్ సీఎం నితిశ్ కుమార్ తో జరిగిన సమావేశంలోనూ బీజేపీ ఓడించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణే ప్రధాన ఎజెండాగా ఉందంటున్నారు. బీహార్ లోని జేడీయూ ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారంలోనూ ఢిల్లీలో పర్యటించారు నితీశ్ కుమార్. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, వామపక్షాల నేతలను ఆయన కలుసుకున్నారు. ఈ సమావేశాల్లోనూ 2024 ఎన్నికలపైనే చర్చ సాగిందని తెలుస్తోంది.
బీజేపీ వ్యతిరేకంగా ఏర్పాటు దిశగా ఇటీవల కాలంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గులాబీ బాస్.ఇప్పటికే పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు.కేసీఆర్ అడుగులతో ఆయన జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగింది. భారతీయ రాష్ట్ర సమితి పేరు ఖరారైందని.. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైందనే వార్తలు వచ్చాయి. తర్వాత కొత్త పార్టీ కాదు కొత్త కూటమి దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. ఇటీవలే బీహార్ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో చర్చలు జరిపారు. తర్వాత ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. ఈ పర్యటనలో జాతీయ రాజకీయాలపైనే కేసీఆర్, నితీశ్ కుమార్ మధ్య మంతనాలు సాగాయని చెబుతున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తో గతంలో కేసీఆర్ మంతనాలు సాగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ఉన్న సమయంలో ముంబైలో వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు కేసీఆర్. ఎన్సీపీ అధినేత శరద్ పవార తో మాట్లాడారు. బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత, దేశ మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమై తన కార్యాచరణ వివరించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఇటీవలే హైదరాబాద్ వచ్చి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు మద్దతుగా ఉంటామని ప్రకటింటారు. మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
Also Read: GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook