Rapolu Anand Bhaskar Joins TRS: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని చేనేత, జౌళి శాఖ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక పాలసీ తీసుకురాకపోవడంతో చేనేత కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫామ్ టు ఫ్యాబ్రిక్ ఫామ్ టు ఫ్యాషన్ అని స్టేట్మెంట్లు ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. చేనేత రంగం అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక్క పాలసీ కూడా లేకపోవడం వల్లే ఈరోజు మనకంటే ఎంతో చిన్న దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకలు సైతం దుస్తుల తయారీలో, వస్త్రాల ఉత్పత్తిలో మనకంటే ఎంతో ముందున్నాయని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పత్తిని విస్తృతంగా పండించే మన దేశంలో చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయొచ్చని గత 8 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపి సర్కారుకి చెబుతూ వస్తున్నాం కాని కేంద్రం వైపు నుంచి మాత్రం కనీస స్పందన కూడా లేదని ఆరోపించారు.
చేనేత రంగాన్ని కేంద్రం ప్రోత్సహించకపోగా.. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకం అయ్యేలా కేంద్రం నిర్ణయాలు ఉంటున్నాయని కేంద్రంపై మండిపడిన మంత్రి కేటీఆర్.. స్కిల్ డెవలప్మెంట్ అని అందమైన మాటలు చెబుతున్న కేంద్రం ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్‌ను మాత్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
నరాలనే పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా అద్ది జీవితం అనే వస్త్రాన్ని ఆవిష్కరించే నేతన్న నీకు జోహార్ అని రమణ అన్న చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎంతో మంచి నైపుణ్యం ఉన్న చేనేత కళాకారులు మన దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం వల్ల వాళ్ల నైపుణ్యం నిర్వీర్యం అవుతోంది. ప్రపంచంలో వస్త్రాల తయారీలో చైనా 34% వస్త్రాల ఉత్పత్తితో ముందంజలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా దుస్తుల తయారీలో భారత దేశం కంటే చాలా ముందున్నాయి. ఎంతో నైపుణ్యం ఉన్న కళాకారులు ఉండి కూడా మనమే వెనుకబడిపోతున్నాం. అందుకు చేనేత కార్మికుల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభించడమే కారణం అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
జనగాం నుంచి ఏ నేతన్నలైతే సూరత్‌కి వలస పోయారో.. వాళ్ళు తిరిగి సొంతూళ్లకు రావాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఫలితం కనబడాలంటే ఆ నేతన్నలు వెనక్కి తిరిగి రావాలి. పాలమూరు నుంచి ఉపాధి కోసం వలసపోయిన వాళ్లు తిరిగి రావాలి. నేతన్న మళ్లీ నేతన్నగా కాదు కార్మికుడిగా పారిశ్రామికుడిగా తిరిగి రావాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కల. అందుకు అసరమైన కార్యాచరణను ఆయన మాకు ఇచ్చారని మంత్రి నేత సామాజిక వర్గానికి తెలిపారు.
చేనేత మిత్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నూలు, రసాయనాలు 40% సబ్సిడీ మీద సరఫరా చేస్తోంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి చేనేత లక్ష్మీ అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. నేతన్నలకు చేయూత అనే పొదుపు పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనావైరస్ ప్రభలుతున్న కష్ట కాలంలో 100 కోట్ల రూపాయలకుపైగా రికరింగ్ డిపాజిట్లను కాల గడువు ముగియకముందే రిలీజ్ చేయించి 26 వేల నేత కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని గుర్తుచేసుకున్నారు.
నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల జాబితాను ఏకరువు పెట్టిన మంత్రి కేటీఆర్.. నేతన్నల కోసం తెలంగాణ ఇంత చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి నయా పైస అందడం లేదని వాపోయారు. 1250 ఎకరాలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణ సర్కారుకు సహాయం చేయండి అని అడిగినప్పటికీ.. ఇంతవరకు నయా పైసా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Ex MP Rapolu Ananda Bhaskar Joining Program Live from Telangana Bhavan. https://t.co/r0GYmFUUSX
— TRS Party (@trspartyonline) October 26, 2022
కేంద్రంలో అరుణ్ జైట్లీ నుంచి మొదలుపెడితే నిర్మలా సీతారామన్ వరకు అందరు ఆర్థిక శాఖ మంత్రులని కలిసినప్పటికీ.. ఎవ్వరూ ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. పైగా ఉన్న పథకాలను కూడా మోడీ సర్కార్ రద్దు చేస్తుందని విరుచుకుపడ్డారు. 8 ఏళ్లలో 8 పథకాలు రద్దు చేసిన ఘనత బీజేపికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మాత్రం చేనేత ఉత్పత్తులను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారని.. అయితే 18% జీఎస్టీపై విమర్శలు రావడంతో 13 శాతం తగ్గించి ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చారని అన్నారు.
చేనేత రంగంలో రాపోలు ఆనంద్ భాస్కర్ కి అపార మేథస్సు, జ్ఞానం, అవగాహన ఉన్నాయని.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు పార్టీలో చేరిన ఆయన మేధస్తును పార్టీ పరంగ ఉపయోగించుకుంటామని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రాపోలు ఆనంద్ భాస్కర్ కి ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ మంత్రి కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు.