గ్రామ రెవిన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) జీతాలను పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 6వేల వేతనాన్ని రూ.10,500కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వీఆర్ఏ కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారి జీతాలను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
శనివారం రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో వీఆర్‌ఏల ప్రతినిధులు సీఎంను కలిశారు. తక్కువ జీతాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. వీఆర్‌ఏలకు జీతాలు పెంచుతున్నామన్నారు. నాలుగేళ్లలో వీఆర్ఏల వేతనాలను మూడు రెట్లు పెంచామని, గ్రామాల అభివృద్ధికి వారు కృషి చేయాలని కోరారు. 2014లో వీఆర్‌ఏల జీతాలు రూ.3 వేల నుంచి రూ.6,565కు పెంచారు. ఇప్పుడు రూ.10,500లకు వేతనాలను పెంచారు. టీఏ, డీఏలు రూ.100నుంచి రూ.300కు పెంచారు. కాగా గతేడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల వేతఃనాలను రూ. 10,500లకు పెంచింది.
వీఆర్ఏల వేతనాలు 65 శాతం పెంపు