నవరత్నాల పేరుతో ప్రజాకర్షణ పథకాలు ప్రకటిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఆటో డ్రైవర్లకూ ఓ వరాన్ని ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున వారి ఖాతాలో జమా చేస్తామన్నారు. ఈ డబ్బుతో ఇన్సురెన్స్, మరియు రోడ్ టాక్స్ కట్టుకోవాలని జగన్ సూచించారు. తన పాదయాత్రలో భాగంగా ఆటో డ్రైవర్లు మొర పెట్టుకున్న సమస్యలను ఆలకించిన జగన్ పశ్చిమ గోదావరిలో ఈ మేరకు ప్రకటన చేశారు..
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రోడ్డుపై ఆటో తిరగాలంటే ఫిటెనెస్ సర్టిఫికెట్ తప్పని సరి. రోజుకు సగటున రూ. 300 సంపాదించుకునే ఆటో డ్రైవర్ కు ఇది పెను భారంగా మారింది. ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలంటే ఇన్సురెన్స్ మరియు రోడ్ టాక్స్ కట్టడం తప్పనిసరి. ఏడాదికి వీటి కయ్యే ఖర్చు కనీసం రూ.10 వేలు ఉంటుంది. పూటగడవని పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారం ఆటోడ్రైవర్లకు పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ భారం ఆటో డ్రైవర్ పై పడకుడదనే ఉద్దేశంతో వైసీపీ అధినేత ఈ మేరకు ఆటోవాలా పథకాన్ని ప్రకటించారు.