2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రంప్

2019 జనవరి 26న నిర్వహించే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను భారత ప్రభుత్వం ఆహ్వానించినట్లు తెలిసింది.

Last Updated : Jul 14, 2018, 03:27 PM IST
2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రంప్

న్యూఢిల్లీ: 2019 జనవరి 26న నిర్వహించే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించినట్లు తెలిసింది. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆహ్వానం పంపగా.. భారత్ చేసిన విజ్ఞప్తికి వైట్‌హౌస్‌ సానుకూలంగా స్పందించిందని సమాచారం. భారత్‌ ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చే గణతంత్ర వేడుకలకు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరైతే.. ఈ వేడుకకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడు ఆయనే అవుతారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

అమెరికా ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతిని ఆపేయాలని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తున్న సమయంలో ట్రంప్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయుల అమెరికా ఉపాధి అవకాశాలకు గండికొట్టడంతో పాటు పరోక్షంగా భారత్‌పై పలు ఆంక్షలు విధిస్తున్న ట్రంప్‌తో భారత్ మరింత స్నేహాన్ని కోరుకుంటోంది. ట్రంప్‌ కూడా చైనాను కట్టడి చేసేందుకు భారత్‌తో స్నేహాన్నే కోరుకుంటున్నారు. కాగా, ఈ 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు పది ఏషియాన్‌ దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక విదేశీ అతిథిని ఆహ్వానించడం భారతీయ సంప్రదాయంగా ఉంది. 1950లో జరిగిన తొలి గణతంత్ర దినోత్సవం నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 1950లో జరిగిన తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అప్పటి అధ్యక్షుడు సుకర్నోను భారతీయ ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. కాగా ఇంతవరకు ఎక్కువసార్లు ఈ అవకాశం ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లకే లభించాయి.1961లో ఇంగ్లాండ్‌ రాణి ఎలిజబెత్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు.

Trending News