సిమ్లా: 50ఏళ్ల తరువాత 1968లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి మృతదేహం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధాకా గ్లేసియర్ బేస్ క్యాంప్ వద్ద లభ్యమైంది. మంచుకొండలపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తుండగా పర్వతారోహకులకు ఈ మృతదేహం కంటపడింది.
‘తొలుత మాకు విమాన శకలాలు లభించాయి. తర్వాత కొద్ది దూరంలోనే మృతదేహాన్ని గుర్తించారు. ఫొటో తీసి ఆర్మీకి పంపించాం. 1968లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి మృతదేహంగా వాళ్లు గుర్తించారు’ అని పర్వతారోహకుడొకరు తెలిపారు.
1968, ఫిబ్రవరి 7వ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఏఎన్-12 అనే విమానం చండీగఢ్ నుంచి 98 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో లేహ్ బయలుదేరింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల హిమాచల్‌లోని లాహౌల్ వ్యాలీలో కుప్పకూలింది. 2003లో ఈ విమాన శకలాన్ని ధాకా గ్లేసియర్ వద్ద గుర్తించారు. ఆ తరువాత గాలింపు చర్యలు చేపట్టగా ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా పలువురి మృతదేహాలు ఆ మంచులోనే ఎక్కడో కూరుకుపోయి ఉంటాయని.. మృతదేహాలు దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు అప్పట్లో తెలిపారు.