Pawan Kalyan Speech On Janasena Party 10th Formation Day: జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. పార్టీ స్థాపించిన రోజు చెప్పిన సిద్ధాంతాలను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. తన ఏడు సిద్ధాంతాలలో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగిందిలా... చీకటి పడుతోంది.. దారంతా గోతులు.. ఇల్లేమో దూరం. చేతిలో దీపం లేదు. ధైర్యమే దారి చూపుతుంది. రాజకీయాలంటే తెలియదు. సగటు మనిషికి ఏదో సేవ చేయాలనే తపన తప్ప ఇంకేమీ తెలియదు. కానీ రాజకీయ పార్టీ పెట్టిన. జాతీయ జండాకు రూపకర్తగా ఉన్న వ్యక్తి ఆఖరి దశలో ఆకలితో చనిపోయారనే వార్త చాలా బాధేసింది. జీవితం నుంచి అన్నీ తీసేసుకుంటాం. మనవంతుగా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితుల నుంచి దూరంగా పారిపోవద్దు. అందుకే ప్రజల కోసం ముందుకొచ్చాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల రాసిన పాట.. " నువ్వు తినే ప్రతీ గింజ ఈ సమాజం పండించింది" అనే పంక్తిని గుర్తుచేసుకున్న పవన్ కళ్యాణ్.. " మీరు ఇచ్చిన బతుకు ఇది. ఇంతమంది గుండెల్లో పెట్టుకుని ఇచ్చిన అభిమానం. ప్రజల కోసం ఏదైనా చేయాలా లేక ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలా అనుకున్నపప్పుడు ప్రజా సేవకే మొగ్గుచూపాను " అని గుర్తుచేసుకున్నారు. అలా పార్టీ పెట్టి 10 నేటితో ఏళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఎంతో కష్టంతో కూడుకున్న ప్రయాణం. రెండు చోట ఓడిపోయి కూడా పార్టీ నన్ను ముందుకు వెళ్లేలా చేసింది. మహా అంటే ప్రాణం పోతుంది.. ధైర్యం ఉన్న చోటే లక్ష్మీ దేవి ఉంటుందన్న ధీమాతో ముందుకెళ్తున్నాను. దీనికంతటికి మీ అభిమానం, మీరు ఇచ్చిన బలమే కారణం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జనసేన పార్టీ దెబ్బ పడే కొద్ది బలపడుతోంది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన పార్టీ కోసం పులివెందులతో సహా ప్రతీ చోట కనీసం ఒక 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించుకోగలిగింది. 6 లక్షలకుపైగా కార్యకర్తలు పార్టీ వెన్నంటి ఉన్నారు. తెలంగాణలోనూ 25 వేల మంది నుంచి 30 వేల మంది వరకు కార్యకర్తలను జనసేన పార్టీ సొంతం చేసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దశాబ్ధకాలంలో మాటలు పడ్డాం.. మన్ననలు పొందాం... ఓటములు ఎదుర్కొన్నాం. అయినా పరిస్థితులకు దూరంగా పారిపోలేదు. ఎప్పటికీ జనాలకి అండగా ఉంటాం. వారి ఆశీస్సులతోనే ఏదో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ధర్మో రక్షతి రక్షితః.. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే.. అదే నిన్ను రక్షిస్తుంది. ఆ ఒక్క మాటే నన్ను ముందుకు నడిపిస్తోంది. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడం కానీ చట్టాన్ని వారికి అనుకూలంగా వాడుకుని కొంతమందికి మేలు చేయడం కాదు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
" జనసేన పార్టీ స్థాపించేటప్పుడు ఏడు సిద్ధాంతాలను ప్రతిపాదించాను అంటూ ఆ ఏడు సిద్ధాంతాలను గుర్తుచేసుకున్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం.. ఇలా ఏడు సిద్ధాంతాలపై జనసేన పార్టీ నడుస్తోంది" అని గుర్తుచేసుకున్నారు.
కులాల గురించి మాట్లాడటం అంటేనే నాకు ఇబ్బంది..
కులాలను కలిపే ఆలోచన విధానం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరై మరొకరు పరస్పరం ఆధారపడే సమాదం మనది. అలాంటప్పుడు కులాల మధ్య కొట్లాటపెట్టుకుంటే మన సమాజం విచ్చిన్నం అవుద్దే తప్ప ఇంకే ప్రయోజనం లేదు. అందుకే కులాలను కలిపే ఆలోచన విధానం రావాలని కోరుకున్నాను. ఏదో ఒక కులాన్ని అందలం ఎక్కించడానికో లేక ఒక కులంతో గొడవ పడ్డానికో నేను పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు ఐక్యమత్యంతో పనిచేస్తేనే కుల రాజకీయాలు నశించి అందరం బాగుపడతాం. అందుకోసం జనసేన పార్టీ అన్ని కులాలకు అండగా నిలబడుతుంది అని ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి అని పిలుపునిచ్చారు. అన్ని కులాలకు సమాన ప్రాతినిథ్యం కావాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి.. అందుకోసం అన్ని కులాలు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి : AP Governor Speech: మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే ఏపీ గవర్నర్ ప్రసంగం, కారణాలేంటి
ఇది కూడా చదవండి : AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు, 16నే రాష్ట్ర బడ్జెట్
ఇది కూడా చదవండి : Pawan Kalyan Comments: టీడీపీతో జనసేన డీల్.. 20 సీట్లలోనే పోటీ.. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి