Blast at Firecracker manufacturing unit: తమిళనాడు కాంచీపురం జిల్లాలో పండుగ పూటే పెను విషాదం నెలకొంది. కాంచీపురం జిల్లా కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఇక ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు రాగా ఈ బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది.
ఇక మరో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. కాంచీపురం జిల్లా కురువిమలై గ్రామంలో పనిచేస్తున్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు పదార్ధాల కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ఉదయం భారీ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో ముగ్గురు మహిళలు సహా 8 మంది చనిపోయారని, వీరిలో పలువురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చెల్లాచెదురుగా ఉండడంతో వారి వివరాలు తెలియ రాలేదని అంటున్నారు.
ఇక ఈ ఘటనలో మొత్తం 20 మందికి పైగా గాయపడగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. వీరందరినీ మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ పేలుడు కారణంగా కాంచీపురంలో కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి స్పెషల్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు.
ఇక పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారని చెబుతున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో బాణసంచా ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి, అయితే తమిళనాడులోని అన్ని జిల్లాల్లో దేశీయ పేలుడు పదార్థాల తయారీ ప్లాంట్లు పనిచేస్తున్నాయి.
నిజానికి తమిళనాడులో ప్రతి నెలా ఏదో ఒక బ్లాస్టింగ్ ప్లాంట్‌లో ప్రమాదాలు, ప్రాణనష్టం జరగడం సర్వసాధారణంగా మారిందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేలుడు ప్లాంట్ల పనితీరును పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ప్రతి జిల్లాలో ఇలాంటి పేలుడు ప్లాంట్ల నిర్వహణకు ఒక అధికారిని నియమించాలని, ఏదైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులను ప్రభుత్వం బాధ్యులను చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read: Ramadan 2023 Moon Sighting Time: ఇండియాలో నెలవంక కనిపించేది ఎప్పుడో తెలుసా?
Also Read: World Water Day 2023: ప్రపంచ నీటి దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook