కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో బాంబుపేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ నగరంలో ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవలే వీరు కర్నూలు నగర శివార్లలో రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని కొని సర్వే చేయించారు. వరుసకు బంధువైన ఏఎస్సై జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్మెంట్ డ్రైవర్ సుధాకర్ అక్కడికి వచ్చారు.
ఆసమయంలో అక్కడ కూలీలు చెత్తను పోగుచేసి నిప్పు పెట్టగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ శ్రీనివాస్, సుధాకర్‌లను కర్నూలు పెద్దాసుపత్రికి తరలించి.. శ్రీనివాసులకు చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.