జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఇష్టమంటూనే ఆయనతో వేగడం కష్టమన్నారు మంత్రి నారా లోకేష్. సోమవారం ఐటీ కంపెనీల ప్రారంభోత్సవం అనంతరం లోకేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ పవన్ మంచి వ్యక్తే కానీ ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలు తనను ఎక్కువగా బాధిస్తున్నాయని వెల్లడించారు. తనపై పవన్ చేస్తున్నఆరోపణలన్నీ నిరాధారామైనవని పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల్లో పవన్ ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేష్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలకు సంబంధించి పవన్ ఎలా బాధపడుతున్నారో... తాను కూడా అలాగే బాధపడుతున్నానని చెప్పారు. పవన్ చెప్పినట్లు తాను అవినీతిపరుడినే అయితే రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
రాజధాని విషయంలో వెనక్కి తగ్గేది లేదు..
రాజధాని నిర్మాణాన్ని ఆపుతామంటూ పవన్ బెదిరించడం సరికాదని లోకేష్ హితవు పలికారు. కొందరి ప్రయోజనాలంటే కంటే అందరి ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న లోకేష్.. ఎవరో అడ్డపడతామన్నమాత్రానా రాజధాని నిర్మాణం పనులు ఆగవని లోకేష్ వ్యాఖ్యానించారు. కంపెనీలు ప్రారంభించే ప్రతి ఒక్కరికీ ఒకే పాలసీలు ఇస్తామని... పవన్ కల్యాణ్ కూడా కంపెనీలు తెస్తే..వాటికి కూడా అవే పాలసీలు ఇస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు.