అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన చిత్ర దర్శకుడు మరియు రాజకీయ వ్యాఖ్యాత దినేష్ డిసౌజాకి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. 2014లో ఫెడరల్ క్యాంపెయిన్ లాని అతిక్రమించి దినేష్ న్యూయర్క్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడి వద్ద డబ్బులు తీసుకొని.. అతని పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని భావించి ఆయనకు 5 సంవత్సరాల ప్రొబేషన్ విధించారు.
ఈ కాలంలోనే 8 నెలలు ఆయన కమ్యూనిటీ కన్‌ఫైన్‌మెంట్ సెంటర్ పర్యవేక్షణలో ఉండాలని కూడా తెలిపారు. వీటితో పాటు 30,000 డాలర్ల ఫైన్ కూడా చెల్లించాలని చెప్పారు. ట్రంప్‌కు మద్దతుదారైన దినేష్ గతంలో హిల్లరీ క్లింటన్‌తో పాటు బరాక్ ఒబామాకి వ్యతిరేకంగా పలు పత్రికలలో వ్యాసాలు రాశారు. ఒబామాకి వ్యతిరేకంగా ఏకంగా ఒక పుస్తకమే రాశారాయన.
తాజాగా డొనాల్డ్ ట్రంప్ దినేష్‌కు మద్దతిస్తూ ఆయనపై కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికన్ ప్రభుత్వం ఆయనపై చాలా దారుణంగా వ్యవహరించింది అని తెలిపారు. ఒక ప్రెసిడెంట్ హోదాలో దినేష్‌ని క్షమిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై మరో భారతీయ సంతతి న్యాయవాది ప్రీత్ భరారా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాజ్యాంగాన్ని, చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తికి అధ్యక్షుడు ఎలా క్షమాభిక్ష ప్రసాదిస్తారని ఆయన ప్రశ్నించారు. క్షమాభిక్ష ప్రసాదించే హక్కు అధ్యక్షుడికి ఉన్నా.. తాజా కేసులో నిర్ణయం అతని స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ప్రీత్ భరారా పేర్కొన్నారు.