ఫేస్‌బుక్ వారి ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రాం సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా గతంలో కంటే ఇప్పుడు లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం కల్పించింది. గత నవంబర్‌లో లైవ్ ఫీచర్ ప్రవేశపెట్టిన నాటి నుంచి చాలా మంది ఆ సదుపాయాన్ని వాడుకునేందుకు ఆసక్తి చూపించారు. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఫొటోల కంటే లైవ్‌ల ద్వారా అందించేందుకే మొగ్గు చూపారు. అలా లైవ్ చేసే వారి కోసం ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రాం అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్‌తో గతం కంటే ఎక్కువ మంది లైవ్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ఈ రోజు నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బ్లాగ్ లో పేర్కొంది.
కొత్త ఫీచర్ వాడుకోండిలా...
ఇన్‌స్టాగ్రాం యాప్ అప్‌డేట్ చేసుకున్న తర్వాత లైవ్ చేసేటప్పుడు పక్కన `Add` బటన్ వస్తుంది. దాని ద్వారా అప్పుడు లైవ్ చూస్తున్న వారిలో నుంచి ఎంపిక చేసుకుని వారితో కలిసి లైవ్ చేయవచ్చు. వెంటనే మీ లైవ్ స్క్రీన్ భాగాలుగా విడిపోతుంది. ఆ భాగాల్లో గ్రూప్ లైవ్ చేస్తున్న వారంతా కనిపిస్తారు. స్నేహితులందరూ కలిసి లైవ్ చేయాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని ఇన్‌స్టాగ్రాం తెలిపింది.