Lecturer, Railway Porter: పగలు లెక్చరర్, రాత్రిపూట రైల్వే కూలీ.. ఆ డబ్బుతో ఏం చేస్తాడో తెలుసా ?

Lecturer Cum Railway Porter: ఒడిశాకు చెందిన నగేష్ పాత్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. పగటిపూట గెస్ట్ లెక్చరర్‌గా, రాత్రి సమయంలో రైల్వే పోర్టర్‌గా పనిచేస్తూ సంపాదించిన డబ్బును నలుగురి కోసమే ఖర్చు చేస్తూ సమాజహితం కోసం పాటుపడుతున్నాడు. 

Written by - Pavan | Last Updated : Dec 11, 2022, 06:10 AM IST
Lecturer, Railway Porter: పగలు లెక్చరర్, రాత్రిపూట రైల్వే కూలీ.. ఆ డబ్బుతో ఏం చేస్తాడో తెలుసా ?

Lecturer Cum Railway Porter: ఇటీవల కాలంలో కార్పోరేట్ ప్రపంచంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం మూన్‌లైటింగ్. మూన్ లైటింగ్ బాగా హైలైట్ అవుతున్న ప్రస్తుత నేపథ్యంలోనే ఒడిషాకు చెందిన ఒక వ్యక్తి మూన్‌లైటింగ్ స్టోరీ మాత్రం ఎంతో మందికి స్పూరణనిస్తోంది. తనకు వచ్చేది పరిమిత సంపాదనే అయినప్పటికీ.. నిరుపేదలకు సహాయం చేయాలన్న అతడి సంకల్పం.. అతడిని పగలు గెస్ట్ లెక్చరర్ గానూ రాత్రి రైల్వే స్టేషన్ లో కూలీగానూ పనిచేస్తున్నారు.

ఒడిశాకు చెందిన నగేష్ పాత్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. పగటిపూట గెస్ట్ లెక్చరర్‌గా, రాత్రి సమయంలో రైల్వే పోర్టర్‌గా పనిచేస్తూనే ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన స్టూడెంట్స్ కోసం ఒక కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఆ కోచింగ్ సెంటర్ లో తాను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే.. ఇంకొంతమందిని కూడా నియమించుకున్నాడు. రాత్రిపూట రైల్వే కూలీగా పనిచేయడంతో వచ్చే 10 వేల నుంచి 12,000 సంపాదనలోంచే వారికి కూడా వేతనం అందిస్తున్నాడు. తాను రాత్రింబవళ్లు కష్టపడి పని చేయడమే కాకుండా మరో నలుగురికి పని ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. అంతేకాదు.. 8వ తరగతి నుంచి 12వ తరగతి పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాడు.

ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సిహెచ్ నగేష్ పాత్రో వయస్సు 31 ఏళ్లు. కోవిడ్ 19 వ్యాపించిన రోజుల్లో లాక్ డౌన్ కారణంగా రైలు సేవలు కూడా నిలిచిపోయిన సందర్భంలో తన జీవనోపాధిని కోల్పోయాడు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే రోజు గడవదని భావించిన పాత్రో 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు. విద్యార్హతల పరంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పాత్రో.. తనలాంటి నిరుపేదలైన 8వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు.

నలుగురికి ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న దృక్పథమే అతడిని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసేలా చేస్తోందే తప్ప అతడేమీ ధనిక కుటుంబం నుంచి వచ్చిన మనిషి కాదు. ఇంకా చెప్పాలంటే నగేష్ పాత్రోకి అతడి తల్లిదండ్రులు హైస్కూల్ పరీక్ష ఫీజు కూడా చెల్లించలేకపోయారు. దాంతో అతడు సూరత్ వెళ్లి ఒక మిల్లులో పనిచేశాడు. రెండేళ్ల తర్వాత ఆ పని వదిలిపెట్టి హైదరాబాద్ కి వచ్చాడు. ఇక్కడే ఓ షాపింగ్ మాల్‌లో పనిచేసుకుంటూ ఉన్నత చదువులు కూడా పూర్తి చేశాడు. 

వివిధ రంగాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో పనిచేస్తూ లక్షల కొద్ది వేతనం ఎత్తుతున్నప్పటికీ.. తమ కుటుంబం, తమ లగ్జరీ లైఫ్ అంటూ సొంత స్వార్థమే చూసుకుంటున్న వారు ఉన్న ఈ సమాజంలోనే.. తనకేమీ కాని వారి కోసం పగలు ఉపాధ్యాయ వృత్తి పని, రాత్రి రైల్వే కూలీ వృత్తి చేసి మరీ సంపాదించిన నాలుగు రాళ్లను నలుగురి కోసమే ఖర్చు చేస్తున్నపాత్రోకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తనకు లేకున్నా.. తనకు ఉన్నంతలో నలుగురి కోసం బతకాలన్న అతడి ఆశయం అతడిని సోషల్ మీడియాలో హీరోను చేసింది. నగేష్ పాత్రోకో జేజేలు పలికేలా చేసింది. నిజంగా నగేష్ పాత్రో ఒక రియల్ హీరో కదా. మీరేం అంటారు.. మీ కామెంట్స్ ని సోషల్ మీడియాలో మా పోస్ట్ కింద కామెంట్ రూపంలో రాసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

Trending News