ఫేస్‌బుక్‌కి అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లోనే ఇండియాలో ఓ ఊపు ఊపిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఆర్కూట్. టర్కీకి చెందిన ఆర్కూట్ బుయుక్కొక్టె అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థాపించిన ఆర్కూట్ అప్పట్లో భారతీయులకు, బ్రెజిల్ వాసులకు తొలిసారి సోషల్ మీడియా రుచి ఎలా వుంటుందో చూపించింది. అదే సమయంలో ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఫేస్‌బుక్ ఆ తర్వాతి కాలంలో అనేక మార్పులుచేర్పులు చేసుకుని, అదనపు హంగులతో ముందుకు రావడంతో ఆ పోటీని తట్టుకోలేని ఆర్కూట్ సంస్థ క్రమక్రమంగా ఉనికిని కోల్పోయింది. ఆ తర్వాత 2014 సెప్టెంబర్‌లో అంతిమంగా ఆ సంస్థ పూర్తిగా మూతపడింది. అలా 'ఆర్కూట్' పేరుతో భారతీయులకు సోషల్ మీడియా రుచి చూపించిన ఆర్కూట్ బుయుక్కొక్టె మరోసారి 'హలో' అంటూ భారతీయుల ముందుకొచ్చాడు. అవును, 'హలో' అనే సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌తో ఆర్కూట్ బుయుక్కొక్టె మరోసారి ఇండియన్ సోషల్ మీడియా మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఇండియన్ సోషల్ మీడియా మార్కెట్‌లో 20 కోట్ల మంది యూజర్లతో అత్యధిక వాటా కలిగిన ఫేస్‌బుక్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్.. 'డేటా చోరీ' పేరుతో అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న తరుణంలోనే ఆర్కూట్ బుయుక్కొక్టె మరోసారి భారతీయులకు 'హలో' చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హలో సోషల్ నెట్ వర్కింగ్ యాప్ గురించి ఆర్కూట్ బుయుక్కొక్టె మాట్లాడుతూ.. " ఈరోజుల్లో సోషల్ మీడియా తీరు చూస్తోంటే, జనాన్ని ఒక్క చోటుకు చేర్చాల్సిన సోషల్ మీడియా.. వారిని ఏకాకుల్ని చేస్తోంది'' అని అనిపిస్తోంది అన్నాడు. ''ఒకరితో మరొకరు తమ భావాల్ని పంచుకోవడానికి బదులుగా నేటి సోషల్ మీడియా మరో మీడియా మాధ్యమంగా తయారైంది. ఇక ఇప్పుడు పరిస్థితి మారాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకే రకమైన భావసారూప్యం కలిగిన నెటిజెన్స్‌ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే తమ హలో సోషల్ నెట్ వర్కింగ్ యాప్'' అని స్పష్టంచేశాడు. పాజిటివ్, అర్థవంతమైన, అసలైన బంధాలను అనుసంధానం చేయడమే హలో లక్ష్యం అని ఆర్కూట్ తెలిపాడు.
'బ్రెజిల్‌లో 2016లోనే హలో సేవలను ప్రారంభించాం. ఇండియన్ మార్కెట్‌లోనూ హలో యాప్ బిటా టెస్టింగ్ వెర్షన్‌కి 35,000 మంది యూజర్లు వున్నారు. మరోసారి భారతీయులకు హలో యాప్ ద్వారా హలో చెబుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా వుంది' అని ఆనందం వ్యక్తంచేశాడు ఆర్కూట్ బుయుక్కొక్టె. యాప్ స్టోర్, గూగుల్ ప్లే వంటి యాప్స్ ప్లాట్‌ఫామ్స్‌పై హలో యాప్ అందుబాటులో వుంది. హలో యాప్‌లోకి లాగిన్ అయిన యూజర్స్ ఎవరైనా తమకు ఆసక్తి వున్న ఐదు రకాల అంశాలని వెల్లడించాల్సి వుంటుంది. ఆ సమాచారానికి అనుగుణంగా అదే రకమైన ఆసక్తి కలిగిన వారితో యూజర్స్‌ని హలో అనుసంధానం చేస్తుందని అన్నాడు ఆర్కూట్.
యాప్‌లో జవాబుదారీతనం, పారదర్శకత కోసం అడ్వర్టైజర్స్ సైతం హలో యాప్‌లో ఒక ప్రొఫైల్ కలిగి వుండేలా హలో యాప్‌ని రూపొందించడం జరిగింది అని ఆర్కూట్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా యూజర్ల సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మరొకరితో పంచుకునే ప్రసక్తే లేదని ఆర్కూట్ తేల్చిచెప్పాడు. భారత్ తర్వాత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లోనూ హలోను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్కూట్ పేర్కొన్నాడు.