Karthika Masam Somavaram : కార్తీకమాసం, అందులో సోమవారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సారి మంగళవారం చంద్రగ్రహణం వచ్చిన కారణంగా 360 వత్తులు ఎప్పుడు వెలిగించాలని అందరికీ అనుమానం రావొచ్చు. అయితే సోమవారమే దీపప్రజ్వలనాలు చేసుకోవాలి. జ్వాలాదీపోత్సవం కూడా సోమవారమే నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం పూట గ్రహణమైల ఉంటుంది. స్పర్శ కాలం పగటిపూట 5.02 గంటలకు ఉండటంతో పగలు గ్రహణ మైల ఉంటుంది.
దీని తరువాత మోక్షకాలం సాయంత్రం 6.18 గంటలకు అవుతుంది. కనుక అంతా ఆ తరువాత స్నానాలు చేసి గ్రహణ మైల శుద్ధి చేసుకోవాలి. అప్పటికి పౌర్ణమి వెళిపోతుంది. పౌర్ణమి సాధనలకు రాత్రిపూట పౌర్ణమి ప్రధానం కనుక అంతా 7వ తేదీనే చంద్రోపాసన చేసుకోవాలి. అంటే చంద్రశేఖరుని అర్చనలు దీపారాధనలు, జ్వాలాతోరణాదులు 7వ తేదీనే చేసుకోవాలి. ఈ కారణాల వలన అంతా సోమవారం సాయంత్రం గోశాలకు వచ్చి దీపాలు వెలిగించుకోవచ్చు.
నూనె, ప్రమిదలు, వత్తులు గోశాల వారు ఇస్తారు. ఎవరికైనా శని దోషాదులు ఉంటే ఈ సమయంలో నూనె నిమిత్తం గోశాలకు ధనదానం చేయవచ్చు. తెచ్చుకునే వారు ఆవునెయ్యి కూడా తెచ్చుకోవచ్చు.
దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వంసంధ్యాదీప నమోస్తుతే
అంటూ ప్రాతః సంధ్యవేళ, సాయం సంధ్యవేళా దీపాన్ని వెలిగించి అలంకరించి పూజించాలి. దీపమే పరంబ్రహ్మ, దీపం సర్వతమస్సులు (చీకట్లు) పోగొడుతుంది. ఇక్కడ సర్వతమస్సులు అంటే మనలో ఉన్న చీకట్లు, మన బయట ఉన్న చీకట్లు పోగొడుతుందని అర్థం. దీపప్రజ్వలనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. కనుక సంధ్యాదీపానికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.
దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖశాంతి సంపదలు పుత్రపౌత్రులు కలుగుతారు. శత్రువులు నాశనం అవుతారు.దీన్ని అనుసరించి గోశాలల్లో కార్తీక సాయంసంధ్యలో దీపాలు వెలిగించమని అనంతసాహితి పిలుపునిచ్చింది.
దీనికి విశేషమైన స్పందన వచ్చింది. గోశాలకు ఎన్నింటికి రావాలి అని కొందరు అడుగుతున్నారు. వారికోసం ఈ సమాచారం ఇస్తున్నాము.
సూర్యాస్తమయం సాయంత్రం 5.31కి అవుతుంది. కనుక అంతా ఈ సమయం ముందు వెనుక దీపప్రజ్వలనం చేసుకోవాలి. దీన్నే సంధ్యాదీపం అంటారు. కనుక మీకు అందుబాటులో ఉన్న గోశాలకు వెళ్ళి ఈ సమయం నుంచీ మీకు కుదిరిన సమయంలో దీపాన్ని వెలిగించి నమస్కరించుకోండి. కార్తీమాసంలో దీపాన్ని వెలిగిస్తే ఎన్ని కిరణాలు వెలుగులు వెదజల్లుతాయో అన్ని కోట్లసంపద మనసొంతం అవుతుంది.
ఇదే దీపాన్ని గోశాలలో వెలిగిస్తే అక్షయ సంపదలు కలుగుతాయి. ఇది మహాభారతంలో ఉన్నది. కనుక అందరూ రాబోయే 7వ తేదీన పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఉన్న శ్రీభూలక్ష్మీమాత గోశాలలో సామూహిక దీపప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనండి. అందరూ నూనె లేదా ఆవునేతితో ప్రమిదలతో వచ్చి శివలింగరూపంలో దీపాలను గోశాలలో వెలిగింవచ్చు. ప్రత్యక్షంగా పాల్గొనలేని వారు గోశాల వారికి తమ వంతు వితరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చు అని అనంతసాహితి ఆశ్రమానికి చెందిన స్వామి అనంతానంద తెలిపారు.
Also Read : Bigg Boss Geetu Elimination : ఎంత ఏడ్చినా ఏమీ లాభం.. చివరకు గీ'థూ' అనిపించుకుంది.. ఇదే గుణపాఠం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook