అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన యంగ్ టీమిండియా జట్టుకు, ఆ జట్టుకు మెళకువలు నేర్పిన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి, టీమిండియాకు సహాయక సిబ్బందిగా వ్యవహరించిన వారికి బీసీసీఐ వరాల జల్లు కురిపించింది. ఆటగాళ్లకు అద్భుతమైన ఆట తీరుని నేర్పించినందుకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్‌కి రూ. 50 లక్షలు, ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున నజరానాగా అందించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
మామూలుగానే ఈ విజయం చాలా ప్రత్యేకమైన విజయం. ఈ ప్రపంచ కప్ విజయంతో నాలుగుసార్లు ప్రపంచ కప్ సొంతం చేసుకున్న దేశంగా భారత్ రికార్డ్ కైవసం చేసుకుంది. దీనికితోడు ఫైనల్లో ప్రత్యర్థి జట్టు అయిన ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించడంతో ఈ విజయం మరిన్ని సంబరాలని తీసుకొచ్చింది.
భారత్ ఆఖరిసారిగా ఆరేళ్ల క్రితం ఉన్ముక్త్ చాంద్ నేతృత్వంలో ఈ ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. అంతకన్నా ముందు 2000 సంవత్సరంలో మహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలో ప్రపంచ కప్ గెలుచుకున్న యంగ్ టీమిండియా.. ఆ తర్వాత 2008లో విరాట్ కోహ్లీ సారధిగా వున్న సమయంలో మరోసారి ప్రపంచ కప్ గెల్చుకుంది.