ఇంగ్లాండ్ గడ్డపై మరో సిరీస్‌పై టీమిండియా గురిపెట్టింది. పొట్టి సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన కొహ్లీ సేన వన్డే సిరీస్ విజయంపై దృష్టి సారించింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో గెలుపొందిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. స్పిన్నర్ కుల్దిప్ అద్భుతంగా రాణిస్తుండటంతో ఈ సిరీస్ గెలుస్తామన్న ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది.
శనివారం లార్డ్స్ మైదానంలో జరిగే రెండో వన్డేలో ఇరుజట్లు తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రెండో వన్డే ఆదివారం జరగాల్సి ఉంది. ఆదివారం ఫీఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుండటంతో వన్డేను శనివారమే నిర్వహిస్తున్నారు.
వన్డేల్లో కుల్దిప్ అత్యుత్తమ బౌలింగ్‌ను నమోదు చేసుకున్నాడు. తొలి వన్డేలో 6 వికెట్లు తీసి భారత్ విజయానికి కీలకంగా మారాడు. బ్యాటింగ్‌లో రోహిత్, ధావన్, కోహ్లీ, ధోనీ, హార్ధిక్‌లు రాణిస్తుండటంతో భారత్ ఈ మ్యాచ్‌ను కూడా గెలుస్తుందని పరిశీలకులు అంచనా.
మరోవైపు విజయాలతో ఉత్సాహంతో బరిలో దిగుతున్న టీమిండియాను ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడితో ఎదుర్కోనుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ జో రూట్ వైఫల్యం ఇంగ్లాండ్‌కు నష్టం చేస్తోంది. ఇంగ్లాండ్ బౌలింగ్ కూర్పు టీమిండియా బ్యాట్స్‌మెన్ ముందు తేలిపోతుంది.
నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్లలో చెప్పుకోదగ్గ మార్పులు ఉండకపోవచ్చు. తొలి వన్డేల్లో ఆడిన ఆటగాళ్లనే ఇరుజట్లు మళ్లీ బరిలోకి దింపే అవకాశాలున్నాయి.
ధోనీ ఈ రోజు సాధించేనా?
అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఎన్నో రికార్డులను సాధించిన ఎంఎస్ ధోనీ.. మరో అరుదైన రికార్డుకు చేరుకోనున్నారు. వన్డేల్లో మరో 33 పరుగులు చేస్తే 10 వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో చేరనున్నాడు. ఇంగ్లాండ్‌తో నేడు జరిగే రెండో వన్డేలో ధోనీ ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.