కేప్‌టౌన్‌లో ఒకవైపు న్యూలాండ్స్ స్టేడియం నెట్‌లో విరాట్ కోహ్లితో పాటు ఇతర భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటూ ఉంటే మరోవైపు భారత త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం జరిగింది. అదే స్టేడియంలో ఎవరో త్రివర్ణ పతాకం తలకిందులుగా ఎగురవేయడంతో, భారత బృందంలోని ఒక వ్యక్తి ఈ విషయాన్ని గమనించి వెంటనే చెప్పడంలో పతకాన్ని మరల సరైన రీతిలో ఎగురవేశారు.
వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా జట్టు ఉంది. సౌతాఫ్రికాతో భారత్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 5న మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్ మైదానంలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ స్టేడియంలో భారత మువ్వెన్నల జెండా పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత టీమిండియా బృందంలోని ఒక వ్యక్తి తలక్రిందులుగా ఎగురవేయబడ్డ భారత పతాకాన్ని చూసి.. వెంటనే వచ్చి తప్పు జరిగిందని సిబ్బందితో చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తప్పును సరిదిద్దుకున్నారు. అయితే అప్పటికే ఈ జరిగిన తప్పు మీడియా కంట పడడంతో.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.