IND VS AUS 2nd ODI Match Highlights: టీమిండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్ కి వచ్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఇండియా 399 పరుగులు చేసి 400 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి ఆసిస్ బౌలర్లకు చమటలు పట్టించారు.
ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన కేఎల్ రాహుల్ సైతం 38 బంతుల్లోనే 52 పరుగులు చేసి తన ఖాతాలో హాఫ్ సెంచరీని వేసుకోగా.. సూర్య కుమార్ యాదవ్ అయితే ఏకంగా ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు బాది మొత్తం 37 బంతుల్లో 72 పరుగులు రాబట్టి ఆసిస్ బౌలర్లకు బెంబేలెత్తించాడు. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లో రానించడంతో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దీంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
రెండో మ్యాచ్‌లో 400 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా రెండో ఓవర్‌లోనే మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్‌లను ప్రసిధ్ కృష్ణ అవుట్ చేయడంతో ఆ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. స్మిత్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆసిస్ ఆటగాళ్లు లక్ష్య ఛేదనలో ఉండగా 9 ఓవర్ వద్ద ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ గంటసేపు నిలిచిపోయింది. అప్పటికి ఆసిస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు మాత్రమే చేసింది. కాగా వర్షం వెలిసిన అనంతరం డక్‌వర్త్ - లూయిస్ - స్టెర్న్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాకు ఎదుర్కోవాల్సిన విజయ లక్ష్యాన్ని సవరించి 33 ఓవర్లలో 317 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించారు.
మ్యాచ్ మళ్లీ ప్రారంభమైన అనంతరం 14వ ఓవర్లో యాభైకి చేరిన డేవిడ్ వార్నర్ ఎంత ప్రయత్నించినప్పటికీ, భారత స్పిన్ బౌలర్స్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల ముందు ఆసిస్ పప్పులు ఉడకలేదు. వార్నర్, జోష్, మామస్ వికెట్లను రవిచంద్రన్ అశ్విన్ తీయగా.. అలెక్స్ కేరీ, సీన్ అబ్బాట్, ఆడం జంపాలను రవింద్ర జడేజా ఔట్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్, రవింద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీసుకోగా.. ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు, మొహమ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు. బ్యాట్స్ మెన్, బౌలర్లు సమిష్టి కృషితో టీమిండియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆసిస్‌ని ఆలౌట్ చేసింది. ఫలితంగా 99 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.