Irfan Pathan gives suggestion to Virat Kohli ahead of IND vs AUS Test series: స్వదేశంలో భారత్ వరుస సిరీస్ విజయాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ సమరానికి సిద్దమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇప్పటికే భారత్ చేరుకున్న ఆసీస్.. ప్రాక్టీస్ మొదలెట్టింది. మరోవైపు టీమిండియా ప్లేయర్స్ కొందరు సాధన మొదలెట్టారు. అయితే ఈ సిరీస్‌లో క్రికెట్ అభిమానుల కళ్లన్నీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి.
రెండేళ్లు పరుగులు చేయలేక సతమతమయిన విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ 2022, ప్రపంచకప్ 2022 ద్వారా ఫామ్ అందుకున్నాడు. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లపై కూడా పరుగుల వరద పారించాడు. పరిమిత ఓవర్లలో తిరిగి ఫామ్‌లోకి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీ.. టెస్టుల్లోనూ సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ సహా అభిమానులు కోరుకుంటున్నారు. టెస్ట్ సిరీస్ (Border Gavaskar Trophy 2023) నేపథ్యంలో భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. కోహ్లీ ఆటతీరును విశ్లేషించాడు. అంతేకాదు ఓ కీలక సలహా కూడా ఇచ్చాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ స్పిన్ బౌలింగ్‌లో కాస్త తగ్గించదని, మరింత దూకుడుగా ఆడాల్సి ఉందని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో నాథన్ లయన్, ఆష్టన్ అగర్ స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై విరాట్ కోహ్లీ దృష్టిపెట్టాలి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్‌లో ఇటీవల విరాట్ కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు ఉంది. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో అతడి స్ట్రైక్ రేటు వెనకపడింది. అందుకే విరాట్ మరింత దూకుడుగా ఆడితే బాగుంటుంది. టెస్టు క్రికెట్ అయినా.. కొన్నిసార్లు స్పిన్‌ను దూకుడుగా ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా లయన్ లాంటి బౌలర్ ప్రత్యర్థి జట్టులో ఉన్నపుడు దూకుడుగా ఆడితేనే ఫలితం ఉంటుంది' అని అన్నాడు.
భారత పర్యటన కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆస్ట్రేలియా నాలుగు స్పిన్నర్లను ఎంచుకుంది. నాథన్ లియాన్, ఆష్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్ మరియు అన్‌క్యాప్ ప్లేయర్ టాడ్ మర్ఫీలు స్పిన్ కోటాలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 20 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 1682 పరుగులు చేశాడు. 48.05 సగటుతో ఏడు సెంచరీలు చేశాడు. ఢిల్లీ (ఫిబ్రవరి 17-21), ధర్మశాల (మార్చి 1-5) మరియు అహ్మదాబాద్ (మార్చి 9-13) కూడా టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.