Suryakumar Yadav and Deepak Chahar Ruled Out from T20I Series vs Sri Lanka: భారత్, శ్రీలంక జట్ల మధ్య గురువారం (ఫిబ్రవరి 24) నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయాలతో స్టార్ పేసర్ దీపక్ చహర్, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పటికే గాయాలతో ఓపెనర్ లోకేష్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి గాయాల కారణంగా టీమిండియాకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
తాజాగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చహర్‌కు పిక్క కండరాల గాయమైంది. బంతి వేసేందుకు రన్నింగ్ చేస్తుండగా.. దీపక్ కాలు పట్టేసింది. దాంతో తన ఓవర్లు పూర్తిచేయకుండానే అతడు మైదానాన్ని వీడాడు. దీపక్ చహర్ శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు, పునరావాసం కోసం ఎన్‌సీఏకి వెళ్తాడు అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. చహర్ గాయం పెద్దదే అని తెలుస్తోంది. మార్చి చివరి వారంలో ఆరంభం అయ్యే ఐపీఎల్ 2022 సమయానికి అతడు కోలుకుంటాడో లేదో చూడాలి.
విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనే ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు తెలుస్తోంది. సూర్య కుడి చేతి వేళ్లకు గాయమైందని సమాచారం. మంగళవారం లక్నో వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సూర్య పాల్గొన్నాడు. అయితే అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అతడిని బీసీసీఐ టీ20 సిరీస్ నుంచి తప్పించింది. అయితే సూర్యకు అయిన గాయం ఏంటో బీసీసీఐ వెల్లడించలేదు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన 3వ టీ20లో సూర్య 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. మొదటి మ్యాచులో 18 బంతుల్లో 34 రన్స్ బాదాడు.
దీపక్ చహర్ జట్టుకు దూరమైనా.. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్ రూపంలో ఐదుగురు పేసర్లు అందుబాటులో ఉండడంతో మరొకరిని బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకోలేదు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 24, 26, 27న టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 మ్యాచ్‌కు లక్నో వేదికగా కాగా.. రెండు, మూడు టీ20 మ్యాచ్‌లకు ధర్మశాల అతిథ్యం ఇవ్వనుంది.
భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్.
Also Read: Drunk & Drive Fine: మందుబాబులకు శుభవార్త.. రూ.10వేలు కాదు కేవలం రూ.2 వేలు మాత్రమే! లిమిటెడ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook