IND vs WI 2nd T20I Highlights: టీ20ల్లో తాము ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది వెస్టిండీస్. గయానా వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కరేబియన్ జట్టు. మూడో టీ20 మంగళవారం జరగనుంది.
తిలక్ వర్మ ఒక్కడే..
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ కు దిగింది. తొలి టీ20లో అరంగేట్రంలోనే ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు తిలక్.. రెండో మ్యాచ్ లోనూ సత్తా చాటాడు. అర్ధశతకంతో తిలక్ వర్మ (51; 41 బంతుల్లో 5×4, 1×6) టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మరోవైపు శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. మరోవైపు సగం ఓవర్లపాటు క్రీజులో ఉన్న ఇషాన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కేవలం 27 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన శాంసన్ కూడా భారీ షాట్ యత్నించి ఔటయ్యాడు. మరోవైపు తిలక్ వర్మ జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. ఈక్రమంలోనే తిలక్ 39 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. తర్వాత అకీల్ బౌలింగ్ లో తిలక్ పెవిలియన్ చేరాడు. రెండు సిక్సర్ కొట్టి మాంచి ఊఫు మీదున్న హార్థిక్ కూడా 24 పరుగులే చేసి నిష్క్రమించాడు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్ (6 నాటౌట్) ఫోర్, బిష్ణోయ్ (8 నాటౌట్) సిక్సర్ కొట్టడంతో జట్టు స్కోరు 150 దాటింది.
పూరన్ విధ్వంసం..
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్ధిక్ వేసిన తొలి ఓవర్లలో విండీస్ కింగ్, చార్లెస్ వికెట్లను కోల్పోయింది. కానీ పూరన్(67; 40 బంతుల్లో 6×4, 4×6) రాకతో మ్యాచ్ గతి మారిపోయింది. వచ్చి రావడంతో రవి బిష్ణోయ్ ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టడంతో జట్టు స్కోరు ఆరు ఓవర్లకే 60 దాటింది. కేవలం 29 బంతుల్లోనే పూరన్ హాప్ సెంచరీ చేశాడు. మళ్లీ బౌలింగ్ వచ్చిన హార్ధిక్.. పావెల్ ను ఔట్ చేసి భారత్ కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలో విండీస్ విజయానికి 60 బంతుల్లో 62 పరుగులే కావాలి. పూరన్ విధ్వంసానికి తోడు హెట్ మయర్ కూడా సహకరించడంతో అలవోకగా కరేబియన్ జట్టు పరుగులు రాబట్టింది. కానీ చివరి 5 ఓవర్లలో హైడ్రామా నడిచింది. విండీస్ వరుసగా పూరన్, షెపర్డ్, హోల్డర్, హెట్ మయర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చివరి మూడు ఓవర్లలో విండీస్ 21 పరుగులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. అయితే ఎంతో పట్టుదలగా ఆడిన విండీస్ బ్యాటర్లు అకీల్ (16 నాటౌట్), జోసెఫ్ (10 నాటౌట్) జట్టును గెలిపించారు. పూరన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook