మ్యాచ్ ఓడినా.. సిరీస్ దక్కించుకున్న టీమిండియా మహిళల జట్టు

3వ వన్డే మ్యాచ్ ఓడినా.. వన్డే సిరీస్ దక్కించుకున్న టీమిండియా మహిళల జట్టు

Last Updated : Feb 11, 2018, 04:12 AM IST
మ్యాచ్ ఓడినా.. సిరీస్ దక్కించుకున్న టీమిండియా మహిళల జట్టు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ కాగా 241 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు 3 వికెట్ల నష్టంతో 49.2 ఓవర్ల వద్ద విజయం సాధించింది. 

తొలుత టీమిండియా తరపున క్రీజులోకి వచ్చిన వారిలో దీప్తీ శర్మ (79), వేదా కృష్ణమూర్తి (56) తప్ప మిగితా వాళ్లంతా స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. మొదటి రెండు వన్డే మ్యాచ్ ల్లో 135, 84 పరుగులు చేసిన స్మృతి మందాన ఈ మ్యాచ్‌లో డకౌట్ అయింది. టీమిండియాపై లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా మహిళల జట్టు తరుపున బరిలోకి దిగిన ఓపెనర్ లిజెల్లే లీ 10 పరుగుల వద్దే పెవిలియన్ బాట పట్టింది. ఓపెనర్ లారా వోల్వార్ట్‌ 88 బంతులు ఆడి 4 ఫోర్లతో 59 పరుగులు చేసి విజయానికి పునాది వేసింది. అనంతరం డేన్ వ్యాన్ నైక్రిక్ ‌(41)తో కలిసి జట్టుని గెలిపించే బాధ్యత తీసుకున్న డూ ప్రీజ్ 111 బంతుల్లో 90 పరుగులు (4x7) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 

ఫలితంగా సౌతాఫ్రికా మ్యాచ్ ముగియడానికి మరో నాలుగు బంతులు మిగిలి వుండగానే 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన డూ ప్రీజ్‌‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ.. 2-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ చూపిన స్మృతి మంధానని ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డు వరించింది.

శనివారం నాడు జరిగిన 3వ వన్డే మ్యాచ్‌తో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా మహిళల జట్టు ఫిబ్రవరి 13 నుంచి 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో సఫారీలపై తలపడనుంది. 

Trending News