MS Dhoni to be honoured with permanent seat at Mumbai Wankhede stadium for 2011 ODI World Cup winning Six: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. అంతేకాదు వంద కోట్లకు పైగా భారతీయుల కలను నెరవేర్చిన హీరో కూడా ధోనీనే. 2007 టీ20 ప్రపంచకప్ సహా 2011 వన్డే ప్రపంచకప్‌ను కూడా భారత జట్టుకు అందించాడు. 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను అందించి భారతీయులు ఉప్పొంగేలా చేశాడు. 2011లో మహీ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలిచి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధోనీని గౌరవించాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్ణయించింది.
శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ఎంఎస్ ధోనీ సిక్స్ కొట్టి టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. ఆ అపురూప క్షణాలను ఏ భారతీయుడు కూడా ఇప్పటికీ మరవలేరు. ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైన ముంబై వాంఖడే స్టేడియంలో ఓ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ధోనీ ఫినిషింగ్ సిక్స్ కొట్టగా.. బంతి ఏ సీటులో పడిందో ఆ సీటుకు ధోనీ పేరు పెట్టనున్నట్లు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు. ప్రపంచకప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్‌లోని సీటుకు ధోనీ పేరు పెట్టనున్నారు.
స్టాండ్స్‌లోని సీటుకు పేరు పెట్టే కార్యక్రమం కోసం వాంఖడే స్టేడియానికి రావాల్సిందిగా ఎంఎస్ ధోనీని కోరామని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే చెప్పారు. మహీని మెమెంటోతో సత్కరిస్తామని ఆయన తెలిపారు. ఇక వాంఖడే స్టేడియంలో స్టాండ్స్‌లకు ఇప్పటికే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. స్టేడియం గేట్లకు పాలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్ పేర్లు ఉన్నాయి. అయితే స్టాండ్స్‌లోని సీటుకు పేరు పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి.
శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ఎంఎస్ ధోనీ సిక్స్ కొట్టి 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ముగించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 6 వికెట్లను 274 రన్స్ చేసింది. మహేల జయవర్ధనే (103) సెంచరీ చేశాడు. ఆపై భారత్ 48.2 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 277 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (97) తృటిలో సెంచరీ కోల్పోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.