న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ ఇంగ్లాండ్ వేదికగా నార్తాంప్టన్‌షైర్, వర్సెస్టర్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 35 బంతుల్లో సెంచరీ చేసి దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో వర్సెస్టర్‌షైర్ తరపున ఆడిన గుప్టిల్ 35 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లను నమోదు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగమైన శతకాన్ని నమోదు చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో గుప్టిల్‌తో పాటు డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ(ఇండియా), లూయిస్ వాన్‌డెర్(నమీబియా)లు నాలుగో స్థానంలో ఉన్నారు.
మొదటి స్థానంలో 30 బంతుల్లో శతకం చేసిన క్రిస్ గేల్ (వెస్టిండీస్) ఉండగా.. రెండవ స్థానంలో భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. తొలుత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన నార్తాంప్టన్‌షైర్ జట్టు 188 పరుగులు చేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన వర్సెస్టర్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగిన గుప్టిల్ మొదటి నుంచే రెచ్చిపోయి ఆడాడు. 102 (38 బంతుల్లో) పరుగులు చేసి తొలి వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. గుప్టిల్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ వల్ల వర్సెస్టర్‌షైర్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.
ఇప్పటి వరకూ తన కెరీర్లో 47 టెస్టులు, 154 వన్డేలు, 75 టీ20లు ఆడిన మార్టిన్ గుప్టిల్ వన్డేల్లో అత్యధికంగా 237 పరుగులు చేసి రికార్డులకెక్కాడు. టెస్టుల్లో 189 ఆయన అత్యధిక స్కోరు. వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడు కూడా మార్టిన్ గుప్టిల్ కావడం విశేషం. అలాగే వన్డేలలో తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన న్యూజిలాండ్ ఆటగాడు కూడా గుప్టిల్ కావడం గమనార్హం.
Incredible batting by @Martyguptill for @WorcsCCC!
He smashes a 35-ball 💯 - the joint-fourth fastest in T20 history
Watch every boundary: https://t.co/6e9L3hEVde pic.twitter.com/a13mMgC0z1
— Vitality Blast (@VitalityBlast) July 27, 2018