టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై హై కోర్టులో మరో పిటిషన్

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. చెన్నమనేని పౌరసత్వాన్ని సైతం రద్దు చేసింది.

Last Updated : Nov 21, 2019, 02:15 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై హై కోర్టులో మరో పిటిషన్

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. చెన్నమనేని పౌరసత్వాన్ని సైతం రద్దు చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన చెన్నమనేని రమేష్.. న్యాయం కోసం తాను మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని తేల్చిచెప్పారు. 2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వంపై అప్పటినుంచీ వివాదం కొనసాగుతోంది. జర్మనీకి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో పాటు... అక్కడ ఉండగానే ఆ దేశ పౌరసత్వాన్ని పొందారనేది రమేష్ బాబుపై ఉన్న ఆరోపణ కాగా.. ఎన్నికల్లో పోటీ చేసే ముందు భారతదేశ పౌరసత్వాన్ని తిరిగి పొందే క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ధృవపత్రాలను ఆధారంగా చూపించారనేది ఆయనపై ఉన్న మరో ప్రధానమైన ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓటమిపాలైన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సమగ్ర విచారణ అనంతరం కేంద్ర హోంశాఖ ఆ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. 

ఇదిలావుండగా తాజాగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మరోసారి హై కోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టంచేసిన నేపథ్యంలో.. శ్రీనివాస్ హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్టయితే, ముందస్తు సమాచారం ఇవ్వాలని కోర్టును కోరడంతో పాటు.. తమకు తెలియకుండా ఎలాంటి ప్రక్రియను చేపట్టరాదని శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Trending News