కులమా.. దురహంకారమా..? మిర్యాలగూడ మర్డర్ కేసులో కీలక మలుపు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది.

Last Updated : Sep 16, 2018, 04:37 PM IST
కులమా.. దురహంకారమా..? మిర్యాలగూడ మర్డర్ కేసులో కీలక మలుపు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గర్భవతైన తన భార్య అమృతను శుక్రవారం నాడు ఆసుపత్రికి తీసుకెళ్లి.. చెకప్ చేయించి తిరిగి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో ప్రణయ్ పై ఓ ఆగంతకుడు దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగా విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు. భర్త పై దాడి జరిగాక.. ప్రణయ్ భార్య షాక్‌కు గురైంది. తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కాగా.. ప్రణయ్ హత్యకు కారణం అమృత తండ్రేనని ఆయన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా కుల పట్టింపుల వల్లే తన కుమార్తెను పెళ్లి చేసుకున్న ప్రణయ్ పై దాడికి నిందితుడు మారుతీరావు ప్రేరేపించి ఉండవచ్చని ప్రణయ్ కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కూడా అదే కోణంలో ఆలోచించి.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా అమృత తండ్రి మారుతీరావును, ఏ2 ముద్దాయిగా అమృత బాబాయి శ్రవణ్‌ను చేర్చారు. తర్వాత వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ రోజు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసుల ఎదుట నిందితులు అసలు విషయం అంగీకరించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ప్రముఖ బిల్డర్‌గా పేరుగాంచిన తిరునగరి మారుతీరావు కుమార్తె అమృత, ముత్తిరెడ్డికుంటకు చెందిన పెరుమాళ్ల బాలస్వామి కుమారుడు ప్రణయ్ పదవతరగతి నుండే ప్రేమించుకోవడం ప్రారంభించారు. గతంలో వారు పెళ్లి చేసుకోవాలని అనేక సార్లు భావించినా మారుతీరావు అందుకు అంగీకరించలేదు. అందుకు కులమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ తర్వాత మారుతీరావు అనుచరులు ప్రణయ్ కుటుంబీకులను కూడా భయాందోళనలకు గురిచేశారు. ఈ క్రమంలో ఎవరికీ చెప్పకుండా ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత అమృత తన భర్తతో కలిసి తన అత్త,మామల ఇంటిలోనే ఉంటోంది. ఇటీవలే ఆమె గర్భవతి కూడా అయ్యింది. అయితే తన కుమార్తె వేరే కులస్థుడిని పెళ్లి చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని భావించిన మారుతీరావు.. ప్రణయ్‌ని హత్య చేయించడానికి కిరాయి హంతకుడిని ఏర్పాటు చేశాడు. రూ.10 లక్షల రూపాయలకు బేరం కూడా కుదుర్చుకొని.. హత్య చేయడానికి ప్రేరేపించాడు.  ఈ రోజు అదే విషయాన్ని మారుతీరావు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

‘‘నా కూతురు జోలికి రావద్దని ఎన్ని సార్లు చెప్పినా ప్రణయ్‌ వినలేదు. అతన్ని హత్య చేయించినందుకు నాకు ఎలాంటి బాధలేదు. వారి ప్రేమ కంటే సొసైటీలో నా పరువు, స్టేటస్ ముఖ్యమని అనుకున్నాను. అందుకే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడే అతన్ని హత్య చేయించాను’’ అని మారుతీరావు తెలిపినట్లు సమాచారం. ఇక తన భర్త మరణించిన వార్త తెలియగానే.. ప్రణయ్ భార్య అమృత కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రారంభించింది. హత్య చేసింది తన తండ్రేనని తెలియడంతో.. ఆయనను తీవ్రంగా శిక్షించాలని పోలీసులను కోరింది. 

Trending News