Bandi Sanjay Kumar: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ప్రస్థానానికి మూడేళ్లు

Bandi Sanjay Kumar Special Story: రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీ పీఠాన్ని అధిష్టించి మూడేళ్లు గడిచాయి. రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు ఎంపీగా తన నియోజకవర్గం అభివృద్ధినీ కాంక్షిస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా ఎన్నికై మూడేళ్లయిన సందర్భంగా బండి సంజయ్‌పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 07:26 PM IST
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే..
    ఎంపీగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి
    ఏక కాలంలో రెండు పదవులకు న్యాయం
Bandi Sanjay Kumar: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ప్రస్థానానికి మూడేళ్లు

Bandi Sanjay Kumar Special Story: రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీ పీఠాన్ని అధిష్టించి మూడేళ్లు గడిచాయి. ఓవైపు.. రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు.. ఎంపీగా తన నియోజకవర్గం అభివృద్ధినీ కాంక్షిస్తున్నారు. మూడేళ్లుగా భారీగా నిధులను తీసుకొచ్చారు. కరీంనగర్ ప్రగతిలో తనవంతు పాత్రను పోషిస్తున్నారు. ఎంపీగా ఎన్నికై మూడేళ్లయిన సందర్భంగా బండి సంజయ్‌పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.

బండి సంజయ్‌కుమార్‌. భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు. రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవరిని అడిగినా ఈ విషయం ఠక్కున చెబుతారు. అయితే, అంతకుముందే ఆయన కరీంనగర్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచిన బండి సంజయ్‌కి అధిష్టానం రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే, అటు రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇటు ఎంపీగా కూడా తన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఏక కాలంలో రెండు పదవులకు న్యాయం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా బీజేపీకి కొత్త జవసత్వాలు నింపిన నాయకుడిగా బండి సంజయ్‌కి పేరుంది. కార్యకర్తల్లో భరోసా నింపుతూ, తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ పార్టీకి అండగా నిలిచారని స్థానిక నేతలు చెబుతుంటారు. అలాంటి యువనేత 2019 మే 23వ తేదీన కరీంనగర్‌ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అంటే బండి సంజయ్‌ ఎంపీగా ఎన్నికై సరిగ్గా మూడేళ్లు నిండాయి. ఈ మూడేళ్ల కాలంలో బండి సంజయ్‌ కరీంనగర్‌ను అభివృద్ధిపథంలో దూసుకెళ్లేలా చేస్తున్నారు. ఇప్పటివరకు కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధికోసం 5వేల 458 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు.

తొలిసారి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి మూడేళ్లలోనే ఈ స్థాయిలో నిధులు తీసుకు రావడమంటే మాటలు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తనను ఎన్నుకున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం తపిస్తున్నారు బండి సంజయ్‌. అందులో భాగంగానే.. రోడ్లు, రైల్వే లైన్లు, స్మార్ట్ సిటీ, పీఎంజీఎస్‌వై వంటి వివిధ కార్యక్రమాల కోసం కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టారు. అందులో ప్రధానంగా రోడ్ల విస్తరణ కోసం తీసుకొచ్చిన నిధులే అత్యధికంగా ఉండటం గమనార్హం. 

కరీంనగర్‌ అభివృద్ధికి బండి సంజయ్‌ తీసుకొచ్చిన నిధులను వివరంగా చూస్తే.. సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్-సీఆర్ఐఎఫ్ కింద రూ.205 కోట్లు మంజూరు చేయించారు. ఎంపీ ల్యాడ్స్ కింద రూ.5 కోట్లు కేటాయించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 5 కోట్ల 33 లక్షలు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.116 కోట్లు, కరీంనగర్ –వరంగల్ రోడ్ మరమ్మత్తుల కోసం రూ.40.9 కోట్లు, కరీంనగర్ –వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం రూ.1900.28 కోట్లు, ఎల్కతుర్తి - సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం రూ.578.85 కోట్లు మంజూరు చేయించారు. అలాగే, సెంట్రల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కోసం రూ.19.86 కోట్లు, రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.100 కోట్లు, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1.6 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం రూ.196 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఇతర రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.109.6 కోట్లు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ ఎక్విప్‌మెంట్స్ కోసం రూ.3 కోట్ల నిధులను వెచ్చించారు.

విద్యారంగంపైనా బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. శాతవాహన యూనివర్శిటీకి 12-బి స్టేటస్ తీసుకొచ్చేలా కృషి చేశారు. ఎస్సారార్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కరీంనగర్‌లోని రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకోసం బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. 

కొవిడ్ సమయంలో రాష్ట్రమంతటా కర్ఫ్యూ విధించినప్పుడు.. కరోనా రోగులను కలిసేందుకు.. ఆయా ఆసుపత్రుల దరిదాపుల్లోకి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించని రోజుల్లోనూ బండి సంజయ్ దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ విస్తృతంగా పర్యటించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వేలాదిమందికి రెమిడెసివర్ ఇంజక్షన్లు, పీపీఈ కిట్లను అందజేశారు. ఎంతో మందికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన ఆర్దిక సాయం అందించారు. కరోనా సమయంలో బండి సంజయ్‌ తన ఎంపీ ల్యాడ్స్ నుండి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలను అందజేశారు. 

చదువుకునేందుకు ఇబ్బందిగా ఉన్న ఎంతో మంది పేదలకు పుస్తకాలు, ఫీజులు, ఇతరత్రా ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. శిథిలమైన పలు ప్రభుత్వ పాఠశాలలకు కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు అందించారు. ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతున్న నేటి రోజుల్లో నిరుద్యోగులకు పండిట్ దీన్ దయాళ్ పేరిట కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఆయా కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేశారు. ఎంపీగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న బండి సంజయ్ (Bandi Sanjay Kumar).. హిందూ ధార్మిక కార్యక్రమాల్లోనూ అగ్రభాగాన ఉంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Also read : Errabelli On Sarpanch: సర్పంచులు రోడ్లమీదకు రావొద్దు, పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం

Also read : Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News