Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అమిత్ షా పర్యటన సక్సెస్ అయితే ఆ తరువాత ఖమ్మంలో ప్రధాని నరేంద్ర మోదీతో సభ పెట్టిస్తా అని చెప్పి బీజేపి కార్యకర్తల్లో జోష్‌ని నింపే ప్రయత్నం చేశారు. కేంద్రం తరహాలోనే తెలంగాణలోనూ మోదీ రాజ్యం, రామరాజ్యం తీసుకొస్తాం, గడీల పాలన చేస్తోన్న కేసీఆర్‌ను తరిమికొడుతాం అని అన్నారు.
బీఆర్ఎస్ బాధితుల సంఘం పెడితే ఒక పెద్ద గ్రౌండే నిండుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు, పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే కేసీఆర్ దేశంలో పార్టీని నడుపుతాడంట అని మండిపడిన బండి సంజయ్.. ఇంటింటికి బీజేపీ పర్యటనలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు అధికారం ఇచ్చారు, ఒకసారి బిజెపికి అధికారం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు అని ఇకపై ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ.. తెలంగాణలో ఆ పార్టీకి సంబరాలు చేసే పరిస్థితి లేదు అని అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందన్న బండి సంజయ్.. అనేక సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతరం పోరాటం చేస్తుంది అని అన్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలు ఏవీ అమలుకావడం లేదని.. హామీలు అన్నీ హామీలుగానే మిగిలి పోతున్నాయి అన్నారు. భద్రాచలం శ్రీరాముడికి 100 కోట్లు రూపాయలు ఏమైంది అని బండి సంజయ్ ప్రశ్నించారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం ఇప్పటి వరకు అందలేదన్నారు. తెలంగాణలో మరో 5 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాన్నాయని, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.