చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ మొదలు పెట్టి, ఆ తర్వాత నిర్మాతగా, ఫౌల్టీఫామ్స్ నిర్వహిస్తున్న వ్యాపారవేత్తగా ఎదిగిన బండ్ల గణేష్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్‌కి పార్టీ తరపున దాదాపు షాద్‌నగర్ టికెట్ సైతం ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది. మొదట టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేసి, ఆ పార్టీ తిరస్కరించడంతో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారనే టాక్ సైతం వినిపించింది. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన ముఖాముఖిలో బండ్ల గణేష్ పాల్గొనగా అక్కడ కూడా ఇవే అంశాలు చర్చకొచ్చాయి. దీంతో ఈ ప్రచారంపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. తాను అసలు టీఆర్ఎస్ పార్టీలో చేరతానని కోరకముందే, ఆ పార్టీ తనని తిరస్కరించింది అని ఎలా అంటారని ఎదురు ప్రశ్నించారు.
ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కనుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్‌ని విమర్శిస్తూనే.. మరో రకంగా కేసీఆర్‌ని కీర్తించారాయన. ఇదే ఇంటర్వ్యూలో కేసీఆర్ గురించి చెబుతూ 14 ఏళ్లపాటు ఉద్యమం చేసి, ప్రాణాలు ఫణంగా పెట్టి, తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. తెలంగాణ సాధించిన క్రెడిట్ కేసీఆర్‌దే! అందులో ఎటువంటి డౌట్ లేదు... కాకపోతే తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మాత్రం సోనియా గాంధీకే చెల్లుతుందని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు.