Rajagopal Reddy Arrestd in Munugode: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మునుగోడు ఉపఎన్నిక కోసం గొల్ల కురుమలను మోసం చేసిందని ఆరోపిస్తూ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో నిరసనకు దిగారు. గొర్రెల పథకం పేరుతో లబ్దిదారుల ఖాతాలలో డబ్బులు జమచేసి.. ఎన్నికలు అయిపోగానే డబ్బులు వెనకకు తీసుకుందని మండిపడ్డారు.
మునుగోడులోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అక్కడే బైఠాయించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గొల్ల కురుమల ఖాతాల్లో వేసిన అమౌంట్‌ను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమ సోదరుల అకౌంట్లకు సంబంధించిన ఫ్రీజ్ ఎత్తివేసేంతవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. రెండు గంటల ధర్నా అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాజగోపాల్ రెడ్డిని ధర్నా విరమించాలని కోరినా.. అకౌంట్లపై ఫ్రీజ్ ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఏం జరిగింది..?
నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారులంతా మునుగోడు వాసులే కావడంతో ఎన్నికల సంఘం ఈ నగదు పంపిణీ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల తరువాత నగదు వాడుకోవాలని గొల్ల కురుమలకు చెప్పిన ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేసింది. అయితే ఎన్నికలు ముగిసి పది రోజులు గడుస్తున్నా.. బ్యాంక్ అకౌంట్లపై విధించిన ఫ్రీజ్ ఎత్తివేయలేదని గొల్ల కురుమలు రాజగోపాల్ రెడ్డికి తమ గోడును చెప్పుకున్నారు.
నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వం మునుగోడులో గొల్ల కురుమ సోదరులను మోసగించిన తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. చెప్పినట్లుగానే సోమవారం మధ్యాహ్నం మునుగోడు చౌరస్తాలోని నిరసన తెలుపుతుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ సర్కార్ షాకిచ్చింది. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రా లో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 20 మంది అధికారులు గత నాలుగు గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల సమయంలో సుశీ ఫ్రా ఇన్ ఫ్రా సంస్థ నుంచి మునుగోడుకు చెందిన పలువురు బీజేపీ నేతలకు భారీగా నగదు ట్రాన్స్ ఫర్ అయిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టింది. తాజాగా రాజగోపాల్ రెడ్డి సంస్థలో సోదాలు జరగడం సంచలనంగా మారింది.
Also Read: Childrens Day 2023 : ఈ క్యూట్ ఫోటోల్లో ఉన్న హీరోయిన్లు ఎవరు?..బుల్లితెరపై చెలరేగే బుల్లి భామలు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి