Rapolu Ananda Bhaskar: బీజేపికి గుడ్ బై.. టీఆర్ఎస్‌లోకి రాపోలు ఆనంద భాస్కర్

Rapolu Ananda Bhaskar To Join TRS: బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం అయిపోయాయి.

Written by - Pavan | Last Updated : Oct 24, 2022, 04:44 AM IST
  • కమలం కండువా పక్కనపెట్టి కారెక్కనున్న మరో బీసీ నేత
  • సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన రాపోలు ఆనంద భాస్కర్
  • ఖుల్లం ఖుల్ల మనసులో మాటను బయటపెట్టిన రాపోలు
Rapolu Ananda Bhaskar: బీజేపికి గుడ్ బై.. టీఆర్ఎస్‌లోకి రాపోలు ఆనంద భాస్కర్

Rapolu Ananda Bhaskar To Join TRS: తాజాగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కీలక బీజేపీ నేత, ప‌ద్మ‌శాలి సంఘం నాయ‌కుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, మాజీ ఎంపీ అయిన రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుని కలిశారు. తెలంగాణలో చేనేత రంగం అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని ఆయ‌న అభినందించారు. 

ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేయ‌డంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. భారతీయ జనతా పార్టీ చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంద‌ని.. ఇది నేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారైందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేనేత కుటుంబం నేపథ్యం నుంచి వ‌చ్చిన తాను చేనేతల అభివృద్ధిని దెబ్బతీసేలా చేస్తోన్న బీజేపీ నిర్వాకాన్ని చూస్తూ ఇంకా భ‌రించ‌లేన‌ని అన్నారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతాన‌ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలిపారు.  

తెలంగాణలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌ పథకాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అద్భుతంగా ఉన్నాయ‌ని రాపోలు ఆనంద భాస్క‌ర్ కేసీఆర్ సర్కారుకు కితాబిచ్చారు. అంతేకాకుండా భారత రాష్ట్ర స‌మితి పార్టీ ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీల‌క పాత్ర పోషించాల‌ని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఖుల్లం ఖుల్ల చెప్పేశారుగా..
ఖుల్లం ఖుల్ల
తాను బీజేపిని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు తన మనసలో మాటను బయటపెట్టారు కనుక ఇక రేపోమాపో వన్ ఫైన్ డే చూసుకుని ఆయన కమలం కండువా పక్కనపెట్టి కారు ఎక్కనున్నారని స్పష్టమైపోయింది. మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఓట్లను.. అందులోనూ ఓటు బ్యాంకు ప్రకారం ఏయే సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయో చూసి, స్పష్టమైన లెక్కలేసుకుని ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఆ ఓట్లను లక్ష్యంగా చేసుకునే ఆయా సామాజికవర్గాల్లో కీలక నేతలను తమ పార్టీలో చేరేలా చేరికలు ప్రోత్సహిస్తోందనే బలమైన ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆనంద భాస్కర్ కూడా బీజేపిని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. 

అప్పటి నుంచే ఆపరేషన్ ఆకర్ష్‌లో దూకుడు పెంచిన టీఆర్ఎస్
ఒక రకంగా బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత అందుకు ప్రతిచర్యగా టీఆర్ఎస్ పార్టీ మరింత అగ్రెసివ్‌గా వ్యవహరిస్తోంది. బీజేపిలో ఉన్న అసంతృప్త బీసీ నేతలపై కన్నేసిన టీఆర్ఎస్.. వారిని తమ పార్టీలోకి తీసుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బూడిద భిక్షమయ్య గౌడ్, స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి కొందరు బీసీ నేతలను తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి రప్పించిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు చేనేత సామాజికవర్గానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ వంతు వచ్చింది. చూద్దాం.. మునుగోడు ఉప ఎన్నిక ముగిసేలోపు ఇంకెంత మంది పార్టీలు మారనున్నారో.

Also Read : TRS VS BJP: కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్.. బీజేపీ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి?

Also Read : TRS VS BJP: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు కౌంటర్ ప్లాన్.. త్వరలో బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

Also Read : Komatireddy Rajagopal Reddy: చేతలతోనే బొంద పెడతా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Also Read : TRS OPERATION AKARSH: నేరుగా గ్రౌండ్ లోకి దిగిన సీఎం కేసీఆర్.. కారెక్కనున్న ఉద్యమ లీడర్లు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News