Kalvakuntla Kavitha: కాంగ్రెస్ నేతలకు కవిత సవాల్

BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కారణంగా దేశంలో చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు. 

తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో జరిగిన చెరువుల పండుగ కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెరువులను బాగు చేయాలన్న దానికి వెనుక కారణమేంటన్నది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందు 75 ఏళ్ల క్రితం చెరువులు నిండుకుండలా ఉండేవని, ప్రజల జీవితమంతా చెరువు చుట్టే ఉండేదని గుర్తు చేశారు. చెరువు బాగుంటే ఊరుఊరంతా చెరువుపై ఆధారపడి బతికే పరిస్థితి అని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా చెరువు, నది ఉంటే  ఆ సంస్కృతి, జనజీవితం వాటిపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా రూ. 5 వేల కోట్ల వ్యయంతో 47 వేల చెరువులను మరమ్మత్తు చేసుకున్నామని చెప్పారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశమని, అవి ఎప్పటికీ ఎండిపోవద్దన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాదాపు 20 వేల చెరువులను నింపుతున్నామని, కాబట్టి ఎండకాలంలోనూ రాష్ట్రంలో చెరువులు ఎండిపోవడం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని నీటి వనరులను కొల్లగొట్టారని అన్నారు. దాని వల్ల మనం ఆగమైనందునే ఇవాళ చెరువులను మంచిగ చేసుకుంటున్నామన్నారు. చెరువు మంచిగయ్యి పంటలు పండడం మొదలైతే ఊరు ఊరంతా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

సీఎం కేసీఆర్ రైతాంగంపై అధికంగా దృష్టి సారించారని తెలిపారు. చెరువులు బాగుచేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో చేప పిల్లలను వేస్తున్నదని, దాంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. ఏదైనా ఒక్క మంచిపని జరిగితే దాని ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో కనీసం ఏదో ఒక పథకం రాని ఇల్లు తెలంగాణలో లేదని అన్నారు.

10 సంవత్సరాల క్రితం సాగునీటి  శాఖ మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కనీసం ఆయన సొంత గ్రామంలో కూడా 20 – 30 మందికి పెన్షన్ ఇప్పించుకోలేదని ఆరోపించారు. పెన్షన్ వస్తున్న ఎవరైనా మరణిస్తేనే ఆ స్థానంలో కొత్త వాళ్లకు పెన్షన్ ను మంజూరు చేసేవారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో దుఖంతో మనం తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. కానీ ఈ రోజు ఊరిలో ఎంత మంది దరఖాస్తు చేస్తే అంత మందికి పెన్షన్ వస్తోందని, బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ ను సడలించి మరీ పెన్షన్ ఇచ్చామని తెలిపారు. అధికారంలో సీఎం కేసీఆర్  ఉన్నారు కాబట్టి చివరిగా ఉన్న వాళ్ల వరకు ఫలాలు అందుతాయని చెప్పారు.

“కాంగ్రెస్ నాయకుడు మహేశ్ కుమార్ గౌడ్ లొల్లి చేస్తుండని ఆ పార్టీ వాళ్లు చిన్న పదవి ఇచ్చారు. పదవి ఇచ్చిన తర్వాత లొల్లి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అన్నా... ఒక్కసారి ఎడపల్లి వచ్చి చూడు అన్న. పెన్షన్లు , కేసీఆర్ కిట్ లు ఎన్ని ఇచ్చామో చూడు. అందుకే సంబరాలు చేసుకుంటున్నాము.” అని మహేశ్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడాది మొత్తంలో రూ. 600 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేదని, 2014 నుంచి ఇప్పటి వరకు కరూ. 12 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాము కాబట్టి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నామని తేల్చిచెప్పారు. గతంలో పండిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు పంటకు పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితిని తీసుకొచ్చామని  తెలిపారు.

10 ఏళ్ల తెలంగాణలో ఒక్కొమెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నామని, మొదటి ఐదేళ్లలో చెరువుల్లో పూడికలు తీసుకున్నామని, చెక్ డ్యాములు నిర్మించుకోవడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని, పెన్షన్లు ఇచ్చుకున్నామని వివరించారు. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకోడానికి రూ. 3 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నామని వెల్లడించారు. దాని పేరు గృహ లక్ష్మి పథమని స్పష్టం చేశారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్లాట్లు చేసి ఇచ్చే ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యే షకీల్ చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. చెరువుల మరమ్మత్తు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని, అమృత్ సరోవర్ పేరిట దేశమంతా బీజేపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. కానీ మనం చేస్తున్నదానిలో 10 పైసల మందం కూడా కేంద్రం ఆ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వడం లేదని, దాని వల్ల చెరువులు బాగవ్వడం లేదని విమర్శించారు. దాదాపు 12-13 రాష్ట్రాల్లో చెరువుల మరమ్మత్తు కార్యక్రమం జరుగుతుందని ప్రస్తావించారు. అంటేమంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా మారిందని స్పష్టం చేశారు.

English Title: 
brs mlc kalvakuntla kavitha speech from bodhan constituency
News Source: 
Home Title: 

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ నేతలకు కవిత సవాల్

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ నేతలకు కవిత సవాల్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Kalvakuntla Kavitha: కాంగ్రెస్ నేతలకు కవిత సవాల్
Pavan
Publish Later: 
No
Publish At: 
Friday, June 9, 2023 - 05:48
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini
Request Count: 
54
Is Breaking News: 
No
Word Count: 
555