ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారా: చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారేనా అని చంద్రబాబు తెలంగాణ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. 

Last Updated : Nov 27, 2018, 07:30 PM IST
ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారా: చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారేనా అని చంద్రబాబు తెలంగాణ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. తెలుగుదేశం లేకపోతే కేసీఆర్ రాజకీయ కెరీర్ ప్రారంభమయ్యేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అన్యాయం చేయలేదని.. ఆ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు తాను చేయాల్సిన పనులన్నీ చేశానని.. అలా  అభివృద్ధి చేసిన తెలుగు ముఖ్యమంత్రుల్లో తొలి వరుసలో ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

కేసీఆర్‌ను తాను ఎన్నడూ ఏ మాట కూడా అనలేదని.. కానీ ఆయన అనే మాటలు వింటే బాధ వేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ పై కూడా చంద్రబాబు పలు విమర్శలు చేశారు. ఒకప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే భూకంపం వస్తుందని తెలిపిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఇక తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే.. అక్కడ మహాకూటమి ఏర్పడడం అనేది తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని.. కానీ ఎవరికి నచ్చినట్లు వారు ఎన్నికల్లో నిలుచుకుంటే తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఇక హైదరాబాద్‌ను తానే నిర్మించానని ఎక్కడా ప్రకటించలేదని చంద్రబాబు తెలిపారు. అయితే సైబరాబాద్ నిర్మాణంలో మాత్రం తాను ప్రధాన పాత్ర పోషించానని అన్నారు. ఒక సీఎంగా ఉండి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు, పెట్టుబడులు ఆహ్వానించేందుకు ప్రపంచాన్ని మొత్తం చుట్టిన ఘనత తనదేనని.. తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌, ఐఎస్‌బీ, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటివి ఏర్పాటు చేయడంలో తాను ప్రముఖ పాత్ర వహించానని చంద్రబాబు చెప్పారు. అందుకే తెలంగాణలో పోటీ చేసే హక్కు తెలుగుదేశానికి ఉందని చంద్రబాబు వెల్లడించారు. 

Trending News