Munugode ByElection: మునుగోడుకు ఉపఎన్నిక లేనట్టేనా? కేసీఆర్ ప్లాన్ తుమ్మల చెప్పేశారుగా..!

Munugode ByElection:మునుగోడుకు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అసలు ఉప ఎన్నిక వస్తుందా రాదా... సీఎం కేసీఆర్ ప్లాన్ ఏంటీ అన్న కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 4, 2022, 07:46 AM IST
  • మునుగోడు చుట్టే తెలంగాణ రాజకీయాలు
  • మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు?
  • తుమ్మల కామెంట్లతో కొత్త చర్చ
Munugode ByElection: మునుగోడుకు ఉపఎన్నిక లేనట్టేనా? కేసీఆర్ ప్లాన్ తుమ్మల చెప్పేశారుగా..!

Munugode ByElection: తెలంగాణ రాజకీయాలన్ని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో మునుగోడుకు త్వరలో ఉప ఎన్నిక రానుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండగా తాజాగా జరగనున్న మునుగోడు ఉపఎన్నిక కీలకంగా మారనుంది. అందుకే అన్ని పార్టీల నేతలు మునుగోడుకు క్యూ కడుతున్నారు. ఉప ఎన్నికలో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలో ఉన్నాయి విపక్షాలు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అసలు ఉప ఎన్నిక వస్తుందా .. రాదా... సీఎం కేసీఆర్ ప్లాన్ ఏంటీ అన్న కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

తన అనుచరులతో సమావేశమైన తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని ఓ నేత అడగగా.. పిడుగు ఎప్పుడైనా పడొచ్చు... అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ తుమ్మల కామెంట్ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు చేయవద్దని.. ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుమ్మల నాగేశ్వరరావు కామెంట్లతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని తెలుస్తోంది. పిడుగు ఎప్పుడైనా పడొచ్చు అంటే ఏ క్షణమైనా అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయవచ్చనే టాక్ నడుస్తోంది. ఇటీవలే వరద బాధితులను పరామర్శించేందుకు భద్రాచలం వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడే మాజీ మంత్రి తుమ్మలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళదామని తుమ్మలకు కేసీఆర్ చెప్పారని.. అందుకే కార్యకర్తలతో తుమ్మల అలా మాట్లాడారని అంటున్నారు. తుమ్మల చేసిన పిడుగు కామెంట్లతో మునుగోడు ఉపఎన్నికపై అనుమానాలు వస్తున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేశారు కాని ఇంకా స్పీకర్ కు లేఖ ఇవ్వలేదు. స్పీకర్ కు రాజీనామా ఇచ్చినా.. అది ఎప్పుడు ఆమోదం పొందుతున్నది చెప్పలేం. అది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆగస్టు7న మునుగోడు నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అంటే బీజేపీలో చేరాకే స్పీకర్ ను కలిసి ఆయన రాజీనామా లేఖ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ రెండు మూడు రోజుల్లోనే రాజీనామాను ఆమోదిస్తే ఆగస్టు రెండో వారంలో మునుగోడు సీటు ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించవచ్చు. అప్పటి నుంచి ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అంటే ఉప ఎన్నిక జరపడానికి ఫిబ్రవరి రెండో వారకు వరకు గడువు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ చివరలో గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక జరపాల్సి వస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగే అవకాశం ఉంది.

అయితే ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేయాలనే విషయంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్ తో కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. గుజరాత్ తో పాటు ఎన్నికలకు వెళ్లాలంటే ఈ నెలలోనే అసెంబ్లీ రద్దు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరగాలని కోరుకుంటే.. అక్టోబర్ చివరి వరకు రద్దు చేయాల్సిందే. ఈనెలలో అసెంబ్లీని రద్దు చేస్తే మునుగోడు ఉపఎన్నిక అవసరమే రాదు. కర్ణాటక ఎన్నికలతో పాటు ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేసినా అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారు. అంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే తెలంగాణ అసెంబ్లీ రద్దు కావొచ్చు. ఈ లెక్కన చూసినా మునుగోడుకు ఉప ఎన్నిక జరగదు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇదే ఆలోచనలో ఉన్నారంటున్నారు. విపక్షాలను మొత్తం ఉప ఎన్నికపై ఫోకస్ చేసేలా చేసి.. ఆయన తన పని తాను చేసుకుంటున్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం ఉందంటున్నారు. అందుకే మునుగోడు విషయంలో స్థానిక నేతలు పూర్తి ధీమాగా ఉన్నారంటున్నారు. మొత్తంగా కేసీఆర్ వ్యూహాలను బట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయమే రాజకీయ నిపుణుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.

Read also: Rajgopal Reddy: రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ మంత్రిపదవి ఆఫర్? రాయబారం నడిపింది ఎవరు?

Read also: Hyderabad Traffic Advisory: పోలీస్ టవర్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News