Revanth Reddy: రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్.. అలర్ట్ అయిన సీనియర్లు.. హైకమాండ్‌కు ఫిర్యాదు

Tpcc Chief Revanth Reddy: తెలంగాణలో అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వర్గ పోరులో బిజీగా మారిపోయారు. ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ హైకమాండ్‌కు చేరినట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 12:28 PM IST
Revanth Reddy: రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్.. అలర్ట్ అయిన సీనియర్లు.. హైకమాండ్‌కు ఫిర్యాదు

Tpcc Chief Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్‌లో వార్ సాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో అధికార పార్టీ నేతలు వణికిపోతున్నారు. అటు కమలానికి కౌంటర్‌గా ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసులో సిట్ దర్యాప్తు ముందుకు వెళుతోంది. దీంతో కొన్ని రోజులుగా తెలంగాణ పొలిటికల్ సీన్‌లో కారు, కమలం పార్టీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్నామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా సీన్‌లో కనిపించడం లేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ వ్యూహాలతో కాక పుట్టిస్తుండగా.. అప్రమత్తం కావాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వర్గ పోరుతో రచ్చకెక్కుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని కొందరు సీనియర్లు ఢిల్లీలో మంత్రాంగం నడిపిస్తున్నారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు.. మునుగోడు ఉపఎన్నిక ఫలితాన్ని సాకుగా చూపి ఆయన పీసీసీ పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన మునుగోడు బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. ఇందుకు రేవంత్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ సీనియర్లు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ చీఫ్‌గా కొత్తగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే.. అన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. పార్టీ బలంగా ఉన్న తెలంగాణపై ఆయన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. టీపీసీసీతో పాటు డీసీసీలో మార్పుల దిశగా కసరత్తు మొదలుపెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఈ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. దీంతో రేవంత్ టీమ్ వస్తే తమ పప్పులు ఉడకవని భావించిన కొందరు సీనియర్లు.. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఖర్గేకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి సూచనలు ప్రకారం మార్పులు చేయవద్దని ఖర్గేతో చెప్పినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఆయన వ్యతిరేక వర్గంమల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 

రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు రెండుగా చీలిపోయారని తెలుస్తోంది. యువ నేతలంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవగా.. సీనియర్లలో మెజార్టీ నేతలు రేవంత్ కు వ్యతిరేకంగా ఖర్గేకు నివేది ఇచ్చారని సమాచారం. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి రేవంత్ రెడ్డికి నష్టం చేస్తున్నారని.. మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నేతలను కాకుండా తనతో పాటు వచ్చిన లీడర్లను ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు హైకమాండ్‌కు కంప్లయింట్ చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి కీలక నేతలు పార్టీ వీడారని ఖర్గేకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. రేవంత్ వల్ల మరికొందరు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారట. 

ఇక రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాకే పార్టీకి బూస్ట్ వచ్చిందని, కేడర్ ఉత్సాహంగా పని చేస్తుందని యువ నేతలతో పాటు కొందరు సీనియర్లు ఖర్గే మరో నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లురవి రేవంత్ రెడ్డికి మద్దతుగా గట్టిగా మాట్లాడారని సమాచారం. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రత్యేకంగా ఖర్గేను కలిసి తన మాట చెప్పారట. నేతలు పోయినా పార్టీకి నష్టం లేదు కాని కేడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖర్గేకు రాంరెడ్డి నివేది ఇచ్చారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పనితీరుతో కేడర్‌లో జోష్ నెలకొందని.. దాన్ని నీరు గార్చేలా కొందరు నేతల వైఖరి ఉందని తేల్చి చెప్పారట. రేవంత్ రెడ్డిపై అదే పనిగా విమర్శలు చేస్తూ పార్టీకి ఇబ్బందులు తేవడంతో పాటు కేడర్ ఢీలా పడేలా చేస్తున్నారని అన్నారు. ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగేలా కొందరు నేతలు ప్రవరిస్తున్నారని దామెదర్ రెడ్డి చెప్పారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి మరింత స్వేచ్చ ఇస్తే పార్టీ బలోపేతానికి ఉపయోగమని ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివేదించారని సమాచారం.  

మరోవైపు సీనియర్ల తీరు ఎలా ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించాలని ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్‌ను కొనసాగిస్తూనే తామే నేరుగా తెలంగాణ వ్యవహారాల పైన దృష్టి పెట్టాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే పీసీసీతో పాటు డీసీసీలకు కొత్త కమిటీలు ప్రకటిస్తారని తెలుస్తోంది. జనాల్లో ఉండే నేతలకు ఇందులో చోటు దక్కనుందని సమాచారం. పార్టీలో నియామకాలు పూర్తయిన వెంటనే  ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఆ సమయంలో పార్టీకి రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రకు సమయం లేకపోవడంతో బస్సు యాత్ర చేపట్టే యోచనలో పీసీసీ ఉందని తెలుస్తోంది. మొత్తంగా హస్తినలో సీనియర్ల లొల్లితో పీసీసీ కొత్త కమిటీ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

Also Read: IPL Auction: ఐపీఎల్ వేలంలో రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌ ఉన్న ఆటగాళ్లు వీరే.. ఆ ఇద్దరి ఆటగాళ్లకు జాక్‌పాట్..?  

Also Read:  Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇది నాలుగోసారి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News