తుది జాబితాపై కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ కసరత్తు ; రేవంత్ వర్గం పరిస్థితి ఏంటి ?

                            

Last Updated : Nov 7, 2018, 04:46 PM IST
తుది జాబితాపై కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ కసరత్తు ; రేవంత్ వర్గం పరిస్థితి ఏంటి ?

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రెండో రోజు సమావేశం కొనసాగుతోంది. తొలి రోజు భేటీలో అభ్యర్ధుల ఎంపికపై కరసత్తు చేసిన సభ్యులు మొత్తం 57 మంది అభ్యర్ధుల పేర్లు ఖరారు చేశారు. మిగిలిన అభ్యర్ధులను ఈ రోజు ఖరారు చేసి తుది జాబితా సిద్ధం చేయనున్నారు. సీటు ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సామజిక సమీకరణలతో పాటు బలాబలాలపై స్ర్కీనింగ్ కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సాయంత్రానికి కల్లా అభ్యర్ధుల ఎంపిక వ్యవహారం కొలిక్కి రానుంది. స్ర్కీనింగ్ కమిటీ రెడీ చేసిన తుది జాబితాను రేపు జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 

సామాజిక సమతూల్యతపై దృష్టి
అభ్యర్ధుల ఎంపికలో భాగంగా సామాజిక సమతూల్యతపై కమిటీ సభ్యులు సీరియస్ గా దృష్టి సారించారు. రెడ్డి కాంగ్రెస్ గా పడిన ముద్రను తుడిచివేయాలని టి.కాంగ్రెస్ భావిస్తోంది...ఈ క్రమంలో బీసీలకు 40 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు వెలమ, కమ్మ, మైనార్టీలకూ ప్రాధాన్యత ఇచ్చేలా టి.కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరోవైపు టికెట్లు దక్కని వారిని బుజ్జగించే వ్యూహాన్ని కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం చేసింది. అధికారంలోకి వస్తే టికెట్లు రాని వారికి  కార్పోరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

రేవంత్ వర్గానికి న్యాయం జరిగేనా ?
రేవంత్ రెడ్డితో  పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. రేవంత్ వర్గం ఆశిస్తున్న చాలా చోట్ల పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ ఎటూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కారణాలు ఏవైనా తనతో పాటు వచ్చిన వారికి సీట్లు దక్కాల్సిందేనంటూ రేవంత్ పట్టుబడుతున్నట్లు తెలిసింది. పార్టీలో చేరిన సందర్భంలో తమకు న్యాయం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని.. తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని రేవంత్ వర్గం ధీమాతో ఉంది.  ప్రముఖ మీడియా కథనం ప్రకారం  రేవంత్ రెడ్డి తన వర్గానికి చెందిన 15 మందికి సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. కాగా 8 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు టి.కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠత నెలకొంది.

Trending News