హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్‌కి తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా బి వినోద్ కుమార్‌ని నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వినోద్ కుమార్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారని.. మంత్రిమండలి సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉండటంతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా వినోద్ కుమార్‌కు కేబినెట్ హోదా ఉంటుందని సర్కార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం పాత్ర కీలకమైనది కావడం వల్లే అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్‌ను ఉపాధ్యక్షునిగా నియమించినట్టు కేసిఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా సీఎం ఉండగా ఆ తర్వాతి స్థానంలో వినోద్ కుమార్ కొనసాగనున్నారని తెలుస్తోంది.