ఈ 2 రోజులు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు

 రానున్న రెండు రోజులపాటు అప్రమత్తత అవసరం అని వాతావరణ శాఖ పేర్కొంది.

Last Updated : Jan 6, 2018, 04:07 PM IST
ఈ 2 రోజులు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు

చలి తీవ్రత అధికంగా వుండే సంక్రాంతి సీజన్ సమీపిస్తుండటంతో తెలంగాణలో రాన్రాను ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా అటవీ భూభాగం అధికంగా వున్న ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇవాళ, రేపు అతి శీతల గాలులు వీచే ప్రమాదం వున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత విభాగం సూచించింది. శుక్రవారం ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అతి శీతల గాలులు వీచిన నేపథ్యంలో రానున్న రెండు రోజులపాటు అప్రమత్తత అవసరం అని వాతావరణ శాఖ పేర్కొంది.

ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికన్నా 7 డిగ్రీలు కనిష్టంగా నమోదు కాగా, ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలుగా నమోదవడం స్థానికులని ఆందోళనకు గురిచేస్తోంది. రామగుండం, మెదక్‌లో 3 డిగ్రీలు,  హైదరాబాద్,  హన్మకొండ, నల్లగొండ ప్రాంతాల్లో 2 డిగ్రీల వరకు సాధారణ స్థాయి కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, చిన్నారుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు.

Trending News