KCR National Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆయన జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కొంత ప్రయత్నం కూడా చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవె గౌడ తదితర నేతలతో సంప్రదింపులు జరిపారు. అయితే కేసీఆర్ ఆశించిన స్థాయి స్పందన లభించలేదు. పైగా ఆ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ అంచనాలన్నీ తలకిందులైనట్లయింది. తాజా పరిస్థితులు కూడా కేసీఆర్ అంచనాలు మరోసారి తలకిందులవుతున్నాయా అన్న చర్చకు ఊతమిస్తున్నాయి.
తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి కమలం జోరు కనిపించింది. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో... కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే వాదనకు బలం చేకూరినట్లయింది. మరోవైపు, కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రయత్నాలు చేసి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన కేసీఆర్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమికి వ్యూహ రచన చేస్తారా.. లేక గతంలో మాదిరి సైలెంట్ అయిపోతారా అన్న చర్చ జరుగుతోంది.
ఢీలా పడ్డ కేసీఆర్ టీమ్..?
ఇటీవలే కేసీఆర్ ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో చర్చించారు. రాంఛీకి వెళ్లి జార్ఖంఢ్ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ తో మంతనాలు సాగించారు. త్వరలో బెంగళూరు వెళతానని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ఫోన్ లో కేసీఆర్ తో మంతనాలు సాగించారు. దీంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సీరియస్ గా ఫోకస్ చేసినట్లు కనిపించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ బాస్ స్పీడ్ పెంచుతారని, హస్తినలోనే మకాం వేసి కొత్త కూటమికి వ్యూహరచన చేస్తారనే ప్రచారం జరిగింది. అయతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ టీమ్ ఢీలా పడిందన్న వాదన వినిపిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేసీఆర్ పెట్టుకున్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీలో బీజేపీ గెలిచినా అత్తెసరు మెజార్టీయే వస్తుందని... ఉత్తరాఖండ్ , గోవాలో కమలం ఓడిపోతుందని కేసీఆర్ అంచనా వేశారట. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో కేసీఆర్ ఖంగు తిన్నారని అంటున్నారు. యూపీలో గతంలో కన్నా సమాజ్ వాదీ పార్టీ సీట్లు పెరగడం.. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రావడం కొంత సానుకూలమే అయినా.. జాతీయ స్థాయిలో మోదీని ఢీకొట్టడానికి ఇది చాలకపోవచ్చనే చర్చ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గోవా, మణిపూర్లలో పోటీ చేసినా ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం మమతకు నిరాశ కలిగించిందని తెలుస్తోంది.
బ్రేకులు పడినట్లేనా..?
ప్రస్తుతం పరిస్థితుల్లో కేసీఆర్‌కు మద్దతుగా ప్రాంతీయ పార్టీలు అంత త్వరగా ముందుకు రాకపోవచ్చంటున్నారు. బీజేపీ నుంచి రక్షించుకోవడానికి ప్రాంతీయ పార్టీలు తమ ఇళ్లు చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంత ఈజీ కాదనే చర్చ నిపుణుల నుంచి వస్తోంది. నరేంద్ర మోదీని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేసీఆర్ ప్రతిపాదన తాజా ఫలితాలతో నీరుగారిపోవచ్చని భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Also Read: CM KCR Hospitalised: యశోద ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం క్షేమంగా ఉండాలన్న బండి సంజయ్...
Also Read: Telangana CM KCR: సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు.. వ్యక్తిగత డాక్టర్ ఏం చెప్పారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook