KTR On Formula E Race Case: ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి హైడ్రామా నెలకొంది. ఈ అంశంలో తనపై మోపిన అక్రమ ఆరోపణలపైన అవినీతి నిరోధక శాఖ నోటీసుకి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ అంశంలో తనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తానని అన్నారు. సోమవారం బంజరాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో హాజరయ్యారు. అయితే ఆయనను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్న ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు అందించారు. హైకోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని.. తనకు ఏసీబీ ఇచ్చిన నోటీసుకి రాతపూర్వకంగా స్పందించారు.
డిసెంబర్ 18వ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. డిసెంబర్ 31వ తేదీన తుది వాదనలు ముగిసిన ఈ అంశంలో హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిందన్నారు. ఇదే కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని.. ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను వినిపించిందని గుర్తు చేశారు. హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉన్న సందర్భంలో తనకు ఏసీబీ నోటీసు ఇచ్చిందన్నారు. ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులో ఈరోజు (జనవరి 6) సమాచారం అందించాలని.. సమాచారంతోపాటు, డాక్యుమెంట్లను అందివ్వాలని ఏసీబీ కోరినట్లు చెప్పారు. అయితే వాళ్లకు ఏ అంశాలపై సమాచారం కావాలో అనే విషయాన్ని ఏసీబీ నోటీసులో స్పష్టంగా ప్రస్తావించలేదన్నారు. దీంతోపాటు ఏయే అంశాలు తాలూకు డాక్యుమెంట్లు అడుగుతున్నారో కూడా నోటీసులో తెలపలేదని అన్నారు.
"చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నాకు దక్కిన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్ రాజ్యాంగం నడుస్తుందా..? గతంలో మా పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి గారిని కూడా విచారణ పేరుతో పిలిచి అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్‌ను మీడియాకి వదిలారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి నా వెంట న్యాయవాదులు ఉంటే సమస్య ఏంటో చెప్పాలి. లేదా ఒక పౌరుడిగా నాకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి.
ప్రస్తుతం విచారణ పేరుతో నన్ను ఇక్కడికి పిలిచి.. నా ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ దాడుల్లో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైనా చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచే కుట్ర కూడా జరుగుతుంది. ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఆపేది లేదు. రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కోత విధించి చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఈ కుట్ర. ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్లు చేసినా.. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు. నాకు ఏసీబీ ఇచ్చిన నోటీసులకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు వచ్చాను. అయితే కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.." అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి తీవ్రత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.