Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇమేజ్ తగ్గిందా? టీపీసీసీలో సీనియర్లదే రాజ్యమా?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. దూకుడు రాజకీయాలతో ఆయన సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు.తెలంగాణ పీసీసీలో  సమీకరణలు మారిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది

Written by - Srisailam | Last Updated : Sep 18, 2022, 08:48 AM IST
  • టీపీసీసీలో రేవంత్ రెడ్డి ఏకాకి?
  • చక్రం తిప్పుతున్న సీనియర్లు
  • సీనియర్లకే హైకమాండ్ ప్రాధాన్యత
Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇమేజ్ తగ్గిందా? టీపీసీసీలో సీనియర్లదే రాజ్యమా?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. దూకుడు రాజకీయాలతో ఆయన సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగు దేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కొన్ని రోజులకే కీలక పదవి దక్కించుకున్నారు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ బాస్ గా గత ఏడాది కాలంగా పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి దూకుడే కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తుందనే టాక్ కూడా పొలిటికల్ సర్కిళ్లలో వినిపించింది. కొందరు సీనియర్ నేతలు తనకు సహకరించకపోయినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. అయితే కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ పీసీసీలో  సమీకరణలు మారిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో పార్టీలో రేవంత్ చెప్పిందే జరగగా.. తాజాగా మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయాలు తుస్సవుతున్నాయి. పార్టీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డి కంటే భట్టి విక్రమార్కతో పాటు కొందరు సీనియర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లోనే భట్టీనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో సీనియర్ల మాటే చెల్లుబాటైంది. రేవంత్ రెడ్డి సూచించిన చల్లమల్ల కృష్ణారెడ్డిని కాదని.. సీనియర్లు ప్రతిపాదించిన పాల్వాయి స్రవంతికి హైకమాండ్ టికెట్ కేటాయించింది. తాజాగా మరో విషయంలోనూ రేవంత్ రెడ్డి పార్టీలో ఏకాకిగా మిగిలిపోయారు.

సెప్టెంబర్ 17 వేడుకలను ఈసారి అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలకు అధికారికంగా నిర్వహించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. టీఆర్ఎస్ సర్కార్ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో సంబరాలు చేసింది. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. టీపీసీసీ కూడా తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగానే నిర్వహించింది. ఈ సందర్భంగా  ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని విడుదల చేసింది. ఆ పాటను రాష్ట్రగీతంగా ప్రకటించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక జెండాను తయారు చేసి ఎగురవేస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అయితే కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి పోటీగా కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి  రూపొందించడమే వివాదమైంది.

కొత్త తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణకు ప్రత్యేక జెండాను ఆవిష్కరిస్తామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయంపై కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ రకమైన నిర్ణయాల వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని.. అయినా ఇలాంటివి కాంగ్రెస్ విధానం కాదని వాళ్లు రేవంత్ రెడ్డికి సూచించినట్టు సమాచారం. ఈ విషయాన్ని కొందరు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారట. రాహుల్ కు దగ్గరగా ఉంటే ఓ సీనియర్ నేత..రేవంత్ రెడ్డితో మాట్లాడి పలు సూచనలు చేశారని అంటున్నారు. దీంతో  తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి. సాయంత్రం తర్వాత గాంధీభవన్ లో తాను రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలెవరు హాజరుకాలేదు. విగ్రహం ఆవిష్కరించకపోతే జనాల్లోకి తప్పుడు సంకేతం వస్తుందనే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారని అంటున్నారు. సీనియర్లు మాత్రం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనా పై పార్టీలోని మెజార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

Also Read: AP Capital: రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్రానిదే! సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్..  

Also Read: Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

 

Trending News