YSR Family Dispute: తమ అసమర్థ పాలనను కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం మరో కుట్ర చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, తన సోదరి వైఎస్ షర్మిలను రాజకీయ వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న తిరుమల లడ్డూతో రాజకీయం చేసిన చంద్రబాబు ఇప్పుడు మా కుటుంబ విషయాలతో రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇది దుర్మార్గమని.. ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. ఇది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పారు.
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. జరిగిన విషాదం గురించి కుటుంబసభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు మేమున్నామనే భరోసా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ తన కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు.
Also Read: Sharada Peetham: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు భారీ షాక్.. శారదా పీఠం 15 ఎకరాలు రద్దు
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..'నేను ఇక్కడకు వస్తున్నానని తెలిసి మళ్లీ రాజకీయం మొదలుపెట్టారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు లడ్డూ అంశం తెరపైకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం మొదలుపెట్టారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?' అని జగన్ మండిపడ్డారు.
తమ కుటుంబ వివాదంపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంపై మాజీ సీఎం జగన్ మండిపడ్దారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలని విజ్ఞప్తి చేశారు. 'మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా?' అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండే విషయాలేనని షర్మిల, విజయమ్మతో ఆస్తి గొడవలను తేలికగా తీసుకున్నారు. నిజాలు లేకున్నా వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.
'ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలి. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలి' అని కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. డయేరియాతో ప్రజల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా? అని ప్రశ్నించారు. వెంటనే డయేరియా బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తామే ఇంత సహాయం అందిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని జగన్ ప్రశ్నించారు. వెంటనే డయేరియా వ్యాప్తిపై నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.